ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి స్వంత పార్టీ వారికే ఆయన నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏరి కోరి పక్కన పెట్టుకున్న వారినే జగన్ ఇంటికి పంపించడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తన ఈ నిర్ణయం ద్వారా ఇంత కాలం ప్రభుత్వంపై ఉన్న ఒక పెద్ద విమర్శకు జగన్ ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పైగా ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం తగ్గించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మూడేళ్ల క్రితం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై మొదటగా వచ్చిన విమర్శ సలహాదారుల నియామకం గురించే. అవసరానికి మించి సలహాదారులను ఆయన తీసుకుంటున్నారని కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు జర్నలిస్టులు, మేధావులు కూడా పెదవి విరిచారు. ఒక్కొక్కరిని ఒక్కో శాఖకు సలహాదారులుగా నియమించుకుంటూ వెళ్లింది ప్రభుత్వం. కొందరిని కొత్త పదవులు సృష్టించి మరీ సలహాదారులుగా నియమించింది.
సలహాదారులుగా నియమితులైన వారంతా ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత నమ్మకస్తులు. కష్టకాలంలో ఆయన వెంట ఉండి సహకరించిన వారు. వివిధ వృత్తులు స్థిరపడి సైతం జగన్‌కు మద్దతుగా నిలిచారు. పైగా ఆయన వృత్తుల్లో వారు నిపుణులు. దీంతో అధికారంలోకి వచ్చాక వారి సేవలను ప్రభుత్వానికి ఉపయోగించుకోవాలని జగన్ అనుకున్నారు. వారికి అనుభవం ఉన్న రంగాల్లో సలహాదారులుగా నియమించడం ద్వారా తన కోసం వారు పడిన కష్టానికి గుర్తింపు ఇవ్వాలని జగన్ భావించారు.
ఇలా ఒక్కొక్కరినీ సలహాదారులుగా నియమించుకుంటూ వెళ్లారు. దీంతో ఈ లిస్టు చాంతాడంత పెరిగిపోయింది. క్యాబినెట్ మంత్రుల కంటే సలహాదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిని అస్త్రంగా చేసుకొని ప్రతిపక్షాలు, యెల్లో మీడియా మొదటి నుంచి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. కోర్టులు సైతం సలహాదారుల నియామకాలను తప్పు పట్టిన సందర్భాలూ ఉన్నాయి. సలహాదారులకు వేతనం, ఇతర అలవెన్సులు ప్రభుత్వం ఇస్తోంది. ఒక్కొక్కరికి సుమారు ఇలా ప్రభుత్వం నెలకు రూ.3 లక్షల వరకు ఇస్తోందని లెక్కలు చెబుతున్నాయి.
సుమారు లక్షన్నర కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నిజానికి ఇదేమీ పెద్ద ఆర్థిక భారం కాదు. కానీ, ప్రతిపక్షాలు, యెల్లో మీడియా మాత్రం ప్రజల్లో సలహాదారుల నియామకం రాష్ట్రానికి భారం అనే భావనను కల్పించాయి. ఇది జగన్ పట్ల ఎంతో కొంత వ్యతిరేకత కల్పిస్తోంది. ఇంతా చేసినా కూడా సలహాదారుల్లో చాలా మంది ప్రభుత్వానికి ఉపయోగపడటం లేదనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకో గానీ చాలా మంది సలహాదారులు సైలంట్‌గా ఉంటున్నారు.
గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో సలహాదారులు ఉండేవారు. కానీ, వారి నుంచి విలువైన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అందేవి. ఇవి వైఎస్సార్ ప్రభుత్వానికి చాలా మంచి పేరు తెచ్చాయి. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అందుకే, సలహాదారుల విషయంలో జగన్ ఒక కఠిన నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న సలహాదారుల్లో కేవలం ముగ్గురిని మాత్రమే కొనసాగిస్తూ మిగతా వారందరినీ తప్పించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం సలహాదారులుగా ఉన్న ఇద్దరు మాజీ జర్నలిస్టులతో పాటు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని మాత్రమే సలహాదారులుగా కొనసాగించాలన్న అభిప్రాయానికి జగన్ వచ్చారట. ఇలా చేయడం ద్వారా ఇంతకాలం సలహాదారుల వల్ల ఆర్థిక భారం కలుగుతోందన్న విమర్శకు కూడా జగన్ చెక్ పెట్టాలని భావిస్తున్నారట. త్వరలోనే జగన్ ఈ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.