Wednesday, October 16, 2024

వన్డే వరల్డ్ కప్ బాయ్ కాట్ చేస్తాం…

- Advertisement -

భారత్ , పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్ళుగా క్రికెట్ సంబంధాలు సరిగా లేవు. దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లను బీసీసీఐ పూర్తిగా నిషేధించింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం పాక్ తో ఆడుతోంది. పాక్ టూర్ కు వెళ్ళి దాదాపు 16 ఏళ్ళు దాటిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఆసియాకప్ కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. అయితే పాక్ లో జరిగే ఆసియా కప్ కు తాము జట్టును పంపించే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. ప్రభుత్వం అనుమతితో ముడిపడి ఉన్న ఈ అంశంలో తాము పూర్తిగా దేశానికి కట్టుబడి ఉంటామని కూడా తెలిపింది. తటస్థ వేదికపై వచ్చే ఆసియాకప్ నిర్వహిస్తే ఆడతామని బీసీసీఐ సెక్రటరీ జైషా పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.

బీసీసీఐ ప్రకటనతో ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు బెదిరింపులకు దిగింది. భారత క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ విమర్శలు గుప్పిస్తోంది. పాక్ కు వచ్చేందుకు భారత్ సిద్ధంగా లేకుంటా తాము కూడా అక్కడికి వెళ్లమంటూ పీసీబీ చెప్పింది. 2023 వన్డే వరల్డ్ కప్ భారత్ లో జరగనుండగా.. ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకునేందుకు పాక్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఆసియాకప్ పై బీసీసీఐ వైఖరికి నిరసనగానే వన్డే వరల్డ్ కప్ ను తాము బహిష్కరిస్తామని పీసీబీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఐసీసీలో తమ పలుకుబడి ఉపయోగించి తమను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందంటూ విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తూ ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి టోర్నీ ఆతిథ్యంపై మాట్లాడడం సరికాదంటూ కామెంట్ చేసింది.

ఇదిలా ఉంటే వన్డే ప్రపంచకప్ ను బాయ్ కాట్ చేసే అది పాక్ క్రికెట్ బోర్డుకే తీరని నష్టం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక దేశం రాకుండా టోర్నీని ఆపేసే పరిస్థితి ఉండదు. అదే సమయంలో ఐసీసీ కూడా పాక్ క్రికెట్ బోర్డుపై చర్యలు తీసుకునే అవకాశముంది. బ్లాక్ లిస్టులో పెట్టి నిధులు ఇవ్వకుండా నిర్ణయం తీసుకునే హక్కు కూడా ఐసీసీకి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాక్ బెదిరింపులు ఆ దేశ క్రికెట్ కే ఇబ్బందులు తెస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!