వరల్డ్ కప్ పెను సంచలనంతో ఆరంభమైంది. క్వాలిఫైయింగ్ టోర్నీలో ఆసియా ఛాంపియన్స్ శ్రీలంకకు పసికూన నమీబియా షాకిచ్చింది. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి 55 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. తద్వారా షార్ట్ ఫార్మాట్ లో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని నిరూపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన నమీబియా 163 పరుగులు చేసింది. ఒక దశలో 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. తర్వాత బ్యాటర్లు రాణించడంతో మంచి స్కోర్ సాధించింది. జాన్ ఫ్రిలిక్ 28 బంతుల్లో 44 , బార్డ్ 26, ఈటన్ 20 , ఎరాస్మస్ 20 పరుగులతో రాణించారు. చివర్లో స్మిత్ 16 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 రన్స్ చేసాడు. నమీబియా చివరి ఆరు ఓవర్లలో 70 పరుగులు చేసింది. 164 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభం నుంచే తడబడింది. ఆసియాకప్ లో అదరగొట్టిన లంక బ్యాటర్లు నమీబియా బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. టాపార్డర్ 40 పరుగులకే పెవిలియన్ చేరింది. ఓపెనర్లు నిస్సాంక 9 , కుషాల్ మెండిస్ 6 , ధనంజయ డిసిల్వా 12 , గుణలతిక డకౌటయ్యారు. తర్వాత రాజపక్స, శనక ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరినీ కూడా నమీబియా బౌలర్లు కీలక సమయంలో ఔట్ చేయడంతో లంక ఓటమి ఖాయమైంది. అంతర్జాతీయ క్రికెట్ లో పెద్ద జట్టుపై గెలవడం నమీబియాకు ఇదే తొలిసారి. గత ప్రపంచకప్ లో కూడా సూపర్ 12కు దూసుకొచ్చిన నమీబియా పెద్ద జట్లకు గట్టిపోటీనే ఇచ్చింది.