Thursday, November 7, 2024

లంక చేతిలో ఆసీస్ సెమీస్ బెర్త్

- Advertisement -

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తన సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిజానికి ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌ ఆసీస్‌కు షాకిచ్చేలా కనిపించింది,. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆప్ఘనిస్థాన్ ఛేజింగ్‌లో ఎటాకింగ్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. వికెట్లు పడుతున్నా చివరి వరకూ గొప్పగా పోరాడింది. 40 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన దశలో జడ్రాన్, నయీబ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. ధాటిగా ఆడుతూ స్కోర్ వేగం పెంచారు. వీరిద్దరూ ఔటయ్యాక.. మళ్ళీ ఆఫ్ఘనిస్థాన్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. అయితే చివర్లో అనూహ్యంగా రషీద్‌ఖాన్ చెలరేగిపోయాడు. భారీ సిక్సర్లతో ఆసీస్‌ను కంగారెత్తించాడు. రషీద్ ఖాన్ కేవలం 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో విజయం కోసం 21 పరుగులు చేయాల్సి ఉండగా.. స్టోయినిస్‌ కట్టడి చేశాడు. దీంతో ఆప్ఘనిస్థాన్ విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

అంతకుముందు ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. వార్నర్ 25, గ్రీన్ 3 , స్మిత్ 4 పరుగులకే ఔటవగా.. మిఛెల్ మార్ష్ 45 , స్టోయినిస్ 25 పరుగులతో రాణించారు. చివర్లో మాక్స్‌వెల్ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. అయితే భారీస్కోర్ చేస్తుందనుకున్న ఆసీస్‌ను ఆప్ఘన్ బౌలర్లు కట్టడి చేశారు. మ్యాక్స్‌వెల్ 32 బంతుల్లో 6 ఫోర్లు , 2 సిక్సర్లతో 54 రన్స్ చేశాడు. ఈ విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉన్న ఆస్ట్రేలియా భవితవ్యం ఇప్పుడు శ్రీలంక చేతిలో ఉంది. రేపు ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే ఆసీస్‌కు సెమీస్‌ అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంటిదారి పడుతుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!