Thursday, November 7, 2024

టీ ట్వంటీ ఫార్మాట్…సూర్యా భాయ్ అడ్డా

- Advertisement -

టీమిండియా బ్యాటింగ్ లో ఎప్పుడూ కోహ్లీ, రోహిత్ , పాండ్యా వంటి వారిపైనే అంచనాలుంటాయి. అయితే గత కొంత కాలంగా టీ ట్వంటీ ఫార్మేట్ లో హిట్టర్ గా అదరగొడుతున్నాడు సూర్యకుమార్. ప్రత్యర్థి ఎవరు.. ఆటలో పరిస్థితులతో సంబంధం లేకుండా ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. వరల్డ్ క్రికెట్ లో డివీలియర్స్ ఆటను ఇష్టపడని అభిమాని ఉండడు. అలాంటి ఏబీ ఆటను మరోసారి వరల్డ్ క్రికెట్ కు చూపిస్తున్నాడు సూర్యకుమార్. ఏబీ తరహాలోనే 360 డిగ్రీల్లో షాట్లు ఆడతాడు స్కై…ఇప్పటి వరకూ అతను ఆడిన చాలా మ్యాచ్ లలో డివీలియర్స్ తరహా షాట్లు చాలానే ఉన్నాయి. అందుకే చాలా మంది మాజీ ఆటగాళ్ళు సూర్య కుమార్ ను ఏబీ డివీలియర్స్ తో పోలుస్తారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తున్న సూర్యకుమార్‌ ఇప్పుడు టీమిండియాలో మిస్టర్ 360 ప్లేయర్‌.

తాజాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో అతని షాట్లు చూసిన ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. బ్యాక్‌వర్డ్ స్కేర్ లెగ్‌ మీదుగా స్కై కొట్టిన సిక్సర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే. ఈ షాట్లే సూర్యాను ప్రత్యేకంగా నిలిపాయి.. ఈ షాట్లే కదా టీమిండియా ఏబీగా పిలుచుకునేలా చేశాయి. ఇదిలా ఉంటే షార్ట్ ఫార్మాట్‌లో స్కై రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు…అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గానూ రికార్డులకెక్కాడు.
టీమిండియా తరపున అత్యంత తక్కువ బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. అలాగే టి ట్వంటీ వరల్డ్‌కప్‌లో 100 కంటే ఎక్కువ బంతులాడి అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన జాబితాలో సూర్యకుమార్‌ అగ్రస్థానంలో నిలిచాడు.

అందరూ అంచనా వేసినట్టుగానే వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారిపోయిన సూర్యాభాయ్ ఇటీవలే టీ ట్వంటీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. చాలా కాలంగా సూర్యాను టాప్ ప్లేస్ ఊరిస్తుండగా.. వరల్డ్‌కప్‌లో వరుస హాఫ్ సెంచరీలతో నెంబర్ వన్‌గా నిలిచాడు. అందుకే ఏయ్ బిడ్డా టీ ట్వంటీ ఫార్మేట్ సూర్యకుమార్ అడ్డా అంటున్నారు ఫ్యాన్స్. స్కై జోరు ఆకాశమే హద్దుగా ఇలాగే కొనసాగితే మరోసారి టీమిండియా వరల్డ్‌కప్ గెలవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!