టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సత్తా చాటేందుకు పలు టాప్ టీమ్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి మెగా టోర్నీ ఆస్ట్రేలియాలో జరుగుతుండడంతో బ్యాటర్లకు సవాలే. అయితే ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ కోసం ప్రధాన పోటీ మాత్రం భారత్ , పాకిస్థాన్ బ్యాటర్ల మధ్యనే ఉండనుంది. భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ నంబర్ వన్ కోసం పోటీపడనున్నారు. ప్రస్తుతం ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌లో, మహ్మద్ రిజ్వాన్ నంబర్ వన్‌లో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ రెండో ప్లేస్ లో ఉన్నాడు. గత కొంత కాలంగా సూర్యకుమార్ యాదవ్ ను టాప్ ప్లేస్ ఊరిస్తుంది. రెండు సార్లు తృటిలో నంబర్ వన్ గా నిలిచే అవకాశం కోల్పోయాడు. మహ్మద్ రిజ్వాన్ 853 రేటింగ్ పాయింట్లతో, సూర్యకుమార్ యాదవ్‌కు 838 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన సీరీస్ లో రాణించిన మహ్మద్ రిజ్వాన్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ యేడాది వీరిద్దరూ పోటా పోటీగా పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటి వరకూ సూర్య కుమార్ యాదవ్ 2022 లో 23 మ్యాచ్ లు ఆడి 801 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో సీరీస్ లో దుమ్ము రేపిన సూర్య కుమార్ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియాకు కీలకం కానున్నాడు. అయితే పాక్ క్రికెటర్ రిజ్వాన్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 2022 లో రిజ్వాన్ కేవలం 18 మ్యాచ్ లోనే 821 రన్స్ చేశాడు. సూర్య కంటే 20 రన్స్ ఎక్కువ చేయడంతో టాప్ ప్లేస్ లోనే కొనసాగుతున్నాడు.అయితే అక్టోబరు 23న మెల్‌బోర్న్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ తో మళ్ళీ వీరిద్దరి మధ్య రేసు మొదలు కానుంది. మరి పాక్ ప్లేయర్ ను వెనక్కి నెట్టి సూర్య కుమార్ ఈ సారి అగ్రస్థానం దక్కించుకుంటాడో లేదో చూడాలి.