చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా సాధించగలరా? కావాలని గట్టిగా పట్టుబడతారా? లేకుంటే గతం మాదిరిగా పట్టు జారిపోతారా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్టీఏ మూడోసారి అధికారం నిలబెట్టుకోవడానికి చంద్రబాబు కీలకంగా మారారు. ఎన్టీఏ భాగస్వామ్య పార్టీల్లో టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. చంద్రబాబు అవసరం బిజేపీకి అనివార్యంగా మారింది. అందుకే ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఇదే సరైన సమయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయంలో.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేది విభజన చట్టంలో చేర్చారు. కానీ దశాబ్ద కాలం దాటుతున్నా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. ఇలా చెప్పేదానికంటే ఆ అవకాశాలు లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు రాజకీయంగా ఏపీ అడిగే పరిస్థితిలో ఉండగా.. ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న బీజేపీపై పడింది.
రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2014 లో ఎన్నికలు జరిగియి. కేంద్రంలో యూపీఏ కూటమి ఓటమి పాలై ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చింది. అదే సమయంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా.. ఆ తర్వాత 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని దాదాపుగా తేల్చేసింది. అయితే అప్పుడు సొంతంగా బీజేపీకి మెజార్టీ ఉండటంతో ఏది చెప్పినా చెల్లింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా సాధించే అవకాశం చంద్రబాబు నాయుడుకు దక్కింది.
ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా హైదరాబాద్ తెలంగాణకు రాగా.. ఏపీకి రాజధాని లేకుండా పోయింది. తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కావడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఇక పేదరికం, ఆర్థికంగా వెనుకబడడం అనే కారణాలతో తమకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో బీహార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయాలన్నా.. నరేంద్ర మోదీ.. మరోసారి ప్రధానమంత్రి కావాలన్నా.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలకు సంబంధించిన ఎంపీలే కీలకం కానున్నారు. అయితే ఇప్పుడు మోదీకి సపోర్ట్ చేయాలంటే.. ఏపీ, బీహార్‌లు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి.
భారత రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదు. కానీ 5 వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 1969 లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే అవకాశం కల్పించారు. ప్రత్యేక హోదా అమల్లోకి వచ్చిన మొదట్లో కేవలం అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత మరో 8 రాష్ట్రాలకు కూడా ఈ ప్రత్యేక హోదా కల్పించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. దీంతో దేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోంది.కానీ ఏపీకి ఇవ్వడంలో మాత్రం తాత్సారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. అప్పుడు టీడీపీ అడిగినా పెడచెవిన పెట్టింది. 2019లో సైతం బీజేపీ సొంతంగానే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు వైసీపీ 22 మంది ఎంపీలు ఎందకూ అక్కరకు రాకుండా పోయారు. ఇప్పుడు ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీడీపీకి ప్రత్యేక హోదా సాధించడం చాలా సులువు. కానీ చంద్రబాబు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.