Sunday, September 8, 2024

కేంద్ర మంత్రి పదవులకు ఏపీలో పోటాపోటీ

- Advertisement -

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర కేబినెట్ లో టీడీపీ చేరికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల11న టీడీపీఎల్పీ సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఎమ్మెల్యేలంతా కలిసి చంద్రబాబునాయుడిని టీడీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. నిన్న జరిగిన ఎన్డీయే సమావేశంలో టీడీపీ కీలక మంత్రి పదవులతో పాటు.. స్పీకర్ పదవిని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నేడు జేపీ నడ్డా ఇంటిలో టీడీపీ, జేడీయూకి ఇచ్చే మంత్రుల శాఖలపై చర్చ జరిగింది.

తక్కువలో తక్కువ నాలుగు నుంచి ఐదు శాఖలు, లోక్‌సభ స్పీకర్ పదవిని కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో.. ఆర్థికశాఖ, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్ని బట్టి చూస్తే దాదాపు కీలక శాఖలన్నీ టీడీపీ చేతిలోకి వచ్చేస్తాయ్. ఈ శాఖలనే రేపో మాపో.. ఎన్డీఏ పెద్దలు, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ, అమిత్ షాలతో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఒకవేళ ఇవి ఒప్పుకోని పరిస్థితుల్లో ఇతర ఏ శాఖలు అడగొచ్చు అనే దానిపై పవన్, చంద్రబాబు ఓ క్లారిటీతో ఉన్నట్లుగా తెలియవచ్చింది. ఫలితాలు వచ్చిన రోజు రాత్రి ఇరువురు నేతలు కలుసుకున్న సంగతి తెలిసిందే. అటు తరువాత ఇద్దరూ ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరయ్యారు. అక్కడ కూడా కీలక చర్చలు జరిపినట్టు సమాచారం.

ప్రస్తుతం మోదీ మంత్రివర్గ కూర్పుపైనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ డిమాండ్ చేసిన మంత్రి పదవులను బీజేపీ ఇస్తుందా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. బీజేపీ కీలక శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోనున్నట్లు సమాచారం. హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్లు, రైల్వే, మౌలిక వసతుల శాఖలతో పాటు సంక్షేమ శాఖ, స్పీకర్ పదవిని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకుని.. డిప్యూటీ స్పీకర్ పదవి, పౌర విమానయాన, ఉక్కుశాఖలను టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జేడీయూకి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల్ని, శివసేనకు భారీ పరిశ్రమల శాఖ, జేడీఎస్ కు వ్యవసాయశాఖ కేటాయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

టీడీపీ ఎంపీగా హ్యాట్రిక్‌ కొట్టిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు(శ్రీకాకుళం) కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బీసీ వర్గానికి చెందిన నేతగా, దివంగత కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు వారసుడిగా ఆయనకెంతో మంచి పేరుంది. మరోవైపు చంద్రబాబుకు, టీడీపీ అగ్రనేతలకు ఆయన చాలా సన్నిహితుడు కూడా. ఆయన బాబాయి అచ్చెన్నాయుడు, మామ బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసు తాజాగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. చంద్రబాబుకు సన్నిహితుడైన అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ మాధుర్‌ కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్‌ ఉంది. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దివంగత బాలయోగి కుమారుడు హరీష్‌. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఈసారి ఎంపీగా గెలిచారు.

వీరితో పాటు రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంట్స్‌ అయిన బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్‌, చిత్తూరు ఎంపీ ప్రసాదరావులలో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇకపోతే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, , నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, , నంద్యాల బైరెడ్డి శబరిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే టీడీపీలో ఒకరికి డిప్యూటీ స్పీకర్‌ లాంటి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్‌ కాగా, మూడోసారి లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. జనసేన కూడా ఎన్‌డీయేలో కీలక భాగస్వామి అయినందున బాలశౌరి పేరు పరిశీలనకు వచ్చే అవకాశముంది.భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందిన కేంద్ర మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నేత సీఎం రమేష్‌ పేర్లూ వినిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!