మనం నిద్రపోయేటప్పుడు ఏదో ఒక పురుగు ఒక్కోసారి చెవి దగ్గరకు చేరి గొడవ చేస్తుంటుంది. మనకు తెలియకుండానే అవి ఒక్కోసారి చెవిలో దూరిపోతాయి. ఇలాంటి సంఘటన చైనాలో 24 ఏళ్ళ వ్యక్తికి జరగడంతో అతడు హాస్పిటల్ కు వెళ్లగా అతడి చెవిలో పురుగుల గూడు ఉన్నట్లు గుర్తించారు. తనకు చెవిలో కాస్త ఇబ్బందిగా ఉందని తన తల్లి తండ్రులను చెవిలో ఏదైనా ఉందేమో చూడమని చెప్పాడు. వారు టార్చ్ లైట్ తో చూడగా చెవిలో ఏవో కదులుతున్నట్లు అనిపించడంతో డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లగా అతడి చెవి లోపల దాదాపుగా పది చిన్న చిన్న బొద్ధింకలు ఉండటం డాక్టర్ గుర్తించి వాటిని తీసివేశారు.

బొద్ధింకలు కారణంగా ఆ వ్యక్తి చెవికి ఇన్ఫెక్షన్ చేరడంతో బాగా ఇబ్బందికి గురి చేసిందని డాక్టర్లు చెప్పుకొచ్చారు. బొద్ధింకలు అతడి చెవిలోకి ఎలా చేరాయన్న విషయంపై డాక్టర్లు ఆరా తీయగా అతడు పడుకునే ప్రదేశంలోనే తినుబండారాలను తిని అక్కడ శుభ్రం చేసుకోకుండా పడుకుంటాడని, ఆ ప్రదేశంలోకి బొద్ధింకలు చేరి మెల్లగా అతడి చెవిలోకి చేరినట్లు డాక్టర్లు చెబుతున్నారు. మనం పడుకోబోయే ముందు మన చుట్టు పక్కల మొత్తం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని లేకపోతే మన చెవిలోకి బొద్ధింకలు లాంటి పురుగులు చేరి గూడు కట్టుకుంటాయని డాక్టర్లు చెబుతున్నారు.