దోషం పోగొడతామని, తమను నమ్ముకుంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, మీ జాతకంలో చిన్న చిన్న మార్పులు చేస్తే మీ ఇంట సిరుల పంట పండటం గ్యారెంటీ అని ప్రతి గ్రామంలో ఇలాంటి వారు తప్పకుండా ఉంటారు. వారి జీవనాధారం కూడా ప్రజలను మాయమాటలతో నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, పూజలు పునస్కారాల పేరుతో వేల రూపాయలను ఆ మాయకుల నుంచి దండుకోవడమే పనిగా పెట్టుకుంటారు.

ఇలాంటి ఒక ప్రబుద్ధుడు ఏకంగా ఒక అమాయకుడు దగ్గర నుంచి మూడు కోట్ల రూపాయలు విలువ చేసే నాలుగెకరాల భూమిని అప్పనంగా కొట్టేసాడు. గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్న వేణుగోపాల రావు, ఒక వ్యక్తిని బురిడీ కొట్టించడానికి అమ్మవారి పేరిట ఆస్థి రాస్తే దోషం మొత్తం పోతుందని తరువాత తిరిగి నీ పేరు మీదకు బదిలీ చేసుకోవచ్చని కల్లబొల్లి మాటలు చెప్పాడు.

ఆ భక్తుడు నిజమే అనుకొని తన పేరిట ఉన్న నాలుగెకరాల ఆస్తిని వేణుగోపాలరావు పేరిట రాసాడు. ఇక్కడ అమ్మవారికి కదా రాయవలసింది, మరి ఇతడికి ఎందుకు రాశాడా అని అనుమానం రావచ్చు. అర్చకుడే దేవుడు కదా, నమ్మించడానికి సవాలక్ష మార్గాలు ఉంటాయి. ఇక ఆ పిచ్చి సన్నాసి తన పేరిట ఉన్న ఆస్థి మొత్తం అర్చకుడు వేణుగోపాలరావు పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇక దీనితో పాటు పలు దఫాలుగా పూజలు, పునస్కారాలు, యజ్ఞ యాగాదులు పేరిట 10 లక్షల నగదు, 20 సవర్ల బంగారం కూడా తీసుకొని అతడిని పూర్తిగా నక్కిచ్చేసాడు.

తీరా చివరకు ఎన్ని రోజులు గడుస్తున్నా దోషాలు పోవడం సంగతి పక్కన పెడితే ఉన్న ఆస్తులు పోయి బిచ్చగాడిలా మారడంతో తన ఆస్థి తనకు రాయాలని అడగగా నువ్వు తనకు రాసిచ్చేశావని బుకాయించడంతో ఆ పిచ్చి సన్నాసి చివరకు తేరుకొని తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆస్తులు మొత్తం చక్కగా రిజిస్టేషన్ ఆఫీస్ లో కొత్త బాల్ పెన్ను కొని మరీ సంతకాలు పెట్టిన తరువాత ఇంకా చీటింగ్ కేసు పెడితే ఇప్పుడేమి లాభం. మోసపోయేవాడుంటే మోసం చేసే వారు ఈ ప్రపంచంలో కోకొల్లలు.