21 ఏళ్ళ యువ టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. టీమిండియా మాజీ సారధి వికెట్ కీపర్ ధోని తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది రిషబ్ పంత్ అని అందరూ భావించారు. కానీ గత కొన్ని సిరీస్ లలో అతడి ఆట తీరులో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు అనవసరపు షాట్ లకు వెళ్లి అవుట్ అవ్వడంతో అతడిని గత దక్షిణాఫ్రికా సిరీస్ లో పక్కన పెట్టారు. ఇక రిషబ్ పంత్ జార్ఖండ్ వెళ్లి మహేంద్ర సింగ్ ధోనిని కొద్ది రోజుల క్రితం కలసి వచ్చాడు. అప్పట్లో ధోనితో తన ఆట తీరులో మార్పులతో పాటు కొన్ని సలహాలు తీసుకున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇక దీనికి సంబంధించి రిషబ్ పంత్ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్… మహేంద్ర సింగ్ ధోనిని అనుకరించడానికి ప్రయత్నించవద్దని గిల్ క్రిస్ట్ సలహా ఇచ్చాడు. ఇక ఇదే సందర్భంలో భారత అభిమానులతో పాటు పాత్రికేయులకు కూడా రిషబ్ పంత్ ను ధోనితో పోల్చవద్దని విన్నవించాడు. గతంలో తాను కూడా ఆస్ట్రేలియా ఉత్తమ వికెట్ కీపర్లలో ఒకరైన ఇయాన్ హీలీ వారసుడిగా జట్టులోకి వచ్చినప్పుడు నేను హీలిని అనుసరించకూడదని నిర్ణయించుకున్నానని, అతని నుంచి నేర్చుకోవాలని మాత్రమే చూశానని చెప్పుకొచ్చాడు. పంత్ కూడా తన ఆట తీరుని కొనసాగిస్తూ దిగ్గజ ఆటగాళ్ల సూచనలు మాత్రమే పాటించాలని చెప్పుకొచ్చాడు. వారిని పోలినట్లు ఆడాలనుకుంటే ఇబ్బందులు తప్పవని సూచించాడు.