యువకుడు ఉత్సాహవంతుడు తన తాత మాజీ ముఖ్యమంత్రిని కాదని బయటకు వచ్చినప్పుడు జేజేపీ పార్టీ అధ్యక్షుడు దుశ్యంత్ చౌతాలాను అందరూ పిల్లకుంక వీడేమి చేస్తాడులే అనుకున్నారు అంతా, కట్ చేస్తే తన తాతను కాదని కొత్త పార్టీ పెట్టుకొని తొమ్మిది నెలలు తిరగకుండానే అతి తక్కువ సీట్లు సాధించినా బీజేపీతో కలసి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక దానితో పాటు ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు అబ్బా అంత రాజవైభోగమే, కానీ దుశ్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా గతంలో అధికారంలో ఉన్నప్పుడు తన తండ్రి ఓం ప్రకాష్ చౌతాలాతో కలసి విద్యాశాఖలో 3 వేల మందికి పైగా అన్యాయం చేస్తూ రిక్రూట్మెంట్ లో అవకతవకలకు పాల్పడటంతో ఢిల్లీ హైకోర్టు 2013లో జైలు శిక్ష విధించింది.

అసలు ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామి, వ్యవహారమంతా వేరేగా ఉంటుంది… భాగస్వామ్య పక్షం కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో… ఇంకేముంది రాజు తలచుకుంటే అన్నట్లు అజయ్ చౌతాలా రెండు వారాల పెరోల్ మీద విడుదలయ్యాడు. తన కొడుకు వైభోగంతో పాటు, తన తల్లి చనిపోవడంతో దానికి సంబంధించిన కార్యక్రమాలు ఇలా అతడికి రెండు వారల పెరోల్ ఇవ్వడంతో బయటకు వచ్చాడు.

ఇప్పుడు పెరోల్ మీదనే వచ్చాడు, రాబోయే రోజులలో జేజేపీ పార్టీ కనుక కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యత కొనసాగించి ఎలాంటి ఇబ్బంది బీజేపీ పార్టీకి కల్పించకపోతే, ఏ అక్టోబర్ 2 గాంధీ జయంతో నాడో మరొక నాడు సత్ప్రవర్తన కింద విడుదల చేసినా చేస్తారు. అంతా అధికార బలం. ఆ బలం ఎవరినైనా లోపలకు నెడుతుంది… ఎవరినైనా బయటకు తీసుకొని వస్తుంది. అలాంటి వాటి గురించి చెప్పుకుంటే ఒక జయలలిత, శశికళ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అందరూ బలైనవారే. వీరెవరూ తప్పులు చేయలేదా అంటే చేసారు… కానీ అధికారం కోల్పోయి ఏకుకు మేకవుతున్నాడు అనుకున్నప్పుడే ఇలాంటి కేసులు బయటకు తీస్తారు లేకపోతే అప్పటి వరకు సచ్చిలుడే. అందులో భాగంగానే ఇన్ని రోజులు దాదాపుగా 18 కేసులలో స్టేలు తెచ్చుకుంటూ బయట ఉంటున్న చంద్రబాబు నాయుడు త్వరలో జైలు ఊచలు లెక్క పెట్టవలసిందే అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఏదైనా అధికారంలో ఉన్న మోజే వేరు… అప్పుడు అమిత్ షాను లోపలేసి చిదంబరం ముసిముసి నవ్వుకుంటే… ఇప్పుడు చిదంబరాన్ని లోపలేసి అమిత్ షా మరింత మూసి మూసి నవ్వుకుంటున్నాడు. ఇలాంటివన్నీ సామాన్యులమైన మనం చూసి తరిస్తూ కథలు కథలుగా చెప్పుకోవడమే తప్ప, వీరు మారారు… పాలకులను ఎన్నుకునే శక్తీ ఉన్న మనం అసలే మారం.