వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు, ఘట్టమనేని ఆదిశేషగిరి రావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మంగళవారం వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా ఆదిశేషగిరిరావు తెనాలి నుండి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ జగన్ ఆయనకు విజయవాడ పార్లమెంట్ సీటు ఇస్తానని చెప్పారు. దీనిపై మనస్తాపంతోనే ఆయన వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు.

కాగా వైసీపీని ఆదిశేషగిరిరావు వీడుతున్నారని తెలుసుకున్న వైసీపీ పెద్దలు ఆయనను బుజ్జగించడానికి రంగంలోకి దిగారు. కానీ ఆ బుజ్జగింపులు ఫలించలేదు. ఆదిశేషగిరిరావు సంక్రాంతి తర్వాత కృష్ణ ఫాన్స్ అసోసియేషన్ తరుపున సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ లో చేరనున్నారు. ఆయన మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆ తర్వాత జగన్ కి సన్నిహితంగా ఉన్నారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఆ తర్వాత జగన్ పెట్టిన వైసీపీలో చేరారు. కాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ద్వారా ఆయన టీడీపీలో చేరనున్నారు.

గత ఎన్నికలలో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు నుండి టీడీపీ ఎంపీగా పోటీ వైసీపీ అభ్యర్థి బాలసౌరి మీద భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆదిశేషగిరిరావు సీఎం చంద్రబాబుకి కూడా దగ్గరి బంధువవుతారు. ఏదిఏమైనా ఆదిశేషగిరిరావు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతుండడంతో వైసీపీకి పెద్ద దెబ్భగా చెప్పవచ్చు.
  •  
  •  
  •  
  •  
  •  
  •