చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అందులో భాగంగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో రామ్ చరణ్ నటించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. రామ్ చరణ్ కూడా తన తండ్రితో నటించాలని ఎప్పటి నుంచో ఉబలాటపడుతున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు రామ్ చరణ్ నటించడం లేదని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” చిత్రం రూపొందించడమే అని తెలుస్తుంది. రాజమౌళి తన సినిమా విడుదలయ్యే వరకు మరొక సినిమాలో నటించకూడదని మొదటనే అగ్రిమెంట్ చేసుకుంటాడట. తన సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత నటించుకోవచ్చట. అందువలన రాజమౌళి నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో చరణ్ తప్పుకున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి.

ఇక రామ్ చరణ్ స్థానంలో అల్లు అర్జున్ నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ చిరంజీవి మేనల్లుడు కావడంతో పాటు ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రహీరోలతో ఒకడిగా వెలుగొందుతున్నాడు. గత సంక్రాంతికి విడుదలైన “అల వైకుంఠపురంలో” సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో రామ్ చరణ్ స్థానంలో చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ అల్లు అర్జున్ కొట్టేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్రతి సినిమాను రామ్ చరణ్ నిర్మించడం విశేషం.