తండ్రి ఐఆర్ఎస్ అధికారి, తల్లి ఫిజిక్స్ టీచర్… అమెరికాలోని టెక్సాస్ లోని హ్యూస్టన్ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డీ పట్టా… ఆ తరువాత ఢిల్లీ ఐఐటీలో పదేళ్ల పాటు ప్రొఫెసర్ ఇలా తన జీవితం సాఫీగా సాగుతున్న వేళ ఒక పరిశోధన నిమ్మితం మధ్యప్రదేశ్ లోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు అలోక్ సాగర్. అక్కడ గిరిజనుల దీనస్థితిని చూసి చలించిపోయాడు. వారి కోసం ఏదైనా చేయాలని అలోక్ సాగర్ తలచినప్పుడు గిరిజనులు బయట నుంచి వచ్చిన ఇతడిని నమ్మలేదు. నువ్వు ఏమి చేయవల్సిన అవసరం లేదని తమ బతుకేదో తాము బతుకుతామని అన్నారు.

కానీ వారి పరిస్థితి అర్ధం చేసుకున్న అలోక్ సాగర్ తాను తన జీవన విధానాన్ని మొత్తం మార్చుకోవాలనుకొని ఢిల్లీ వెళ్లి తన ఐఐటి ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మూడు జతల బట్టలతో గిరిజన ప్రాంతం తరలివచ్చారు. వారితో కలసి అక్కడే ఉండాలని నిచ్ఛయించుకున్నాడు. వారిలా తన జీవన శైలిని మార్చుకున్నాడు. ఆ ప్రాంతంలో మాట్లాడే యాస, బాషా అన్ని నేర్చుకుని వారిలో ఒకడిగా తక్కువ ధరకు వారికి నాణ్యమైన విత్తనాలు దొరికేలా తన వంతు సహాయం చేస్తూ గిరి పుత్రులకు చేదోడు వాదోడుగా 32 ఏళ్ళ క్రితం తన ప్రయాణాన్ని వారితో ప్రారంభించాడు.

అలోక్ సాగర్ సామాన్యమైన ప్రొఫెసర్ కాదు… మన మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ లాంటి ఎంతో మంది మేధావులను తీర్చిదిద్దాడు. కానీ గిరి పుత్రుల దీన గాధ తెలుసుకొని తాను కాకపోతే మరెవరైనా విద్యార్థులకు పాఠాలు చెబుతారని, కానీ వీరి బాధలు తీర్చిడానికి ఎవరు ముందుకు రారని, అందరని వదిలేసి తాను ఎక్కడ ఉంటున్నాడో తెలియకుండా జాగ్రత్త పడుతూ వారిలో ఒకడిగా గిరిజనులకు పాఠాలు నేర్పుతూ, వారి పిల్లలకు బడి యొక్క ప్రాముఖ్యత తెలియచేస్తూ జీవిస్తున్న అతడికి 32 ఏళ్ళ తరువాత తన ముసుగు తొలగించవలసిన సమయం ఆసన్నమైందన్న సంగతి అతడు కూడా గుర్తించలేదు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గోడంగిరి అనే అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగే సమయంలో ఒక సర్వే నిమ్మితం అధికారులు అతడు ఉండే గిరిజన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సమయంలో చింపిరి జుట్టు, గుబురు గెడ్డం, ఎండిపోయిన డొక్కలు, చొక్కా లేకుండా ఒంటిని అంటిపెట్టుకున్న ఓ లుంగీ చూడగానే ఎలాంటి ఆదరణ లేని బతికి చెడ్డ ఒక పేద రైతుల కనిపించాడే తప్ప గిరిజనుడిలా వారికి అనిపించలేదు. అతడిని వారు నీది ఏ ప్రాంతమని అడిగినప్పుడు తాను ఇక్కడివాడినని చెప్పినా వారు నమ్మలేదు.

ఇతను గిరిపుత్రుడు కాదని వారికి అనుమానం వచ్చి ఓటర్ కార్డు లేదా ఏదైనా ధ్రువ పత్రాలు చూపించమని అడిగినప్పుడు అలోక్ సాగర్ పదే పదే తాను వీరిలో ఒకరినని తనను వదిలేయమని కోరినా వారు వదలకపోవడంతో అతని ముసుగు మొత్తం తొలగిపోయింది. ఢిల్లీ ఐఐటి నుంచి ఎలెక్ట్రికల్ ఇంజనీర్ ఆ తరువాత పీజీ, తరువాత అమెరికా టెక్సాస్ హ్యూస్టన్ యూనివర్సిటీ నుంచి పీ.హెచ్.డి ఇలా అతడి చరిత్ర మొత్తం తెలిసిన తరువాత ఆ అధికారుల నోట మాట రాలేదు.

తాను ప్రపంచానికి దూరంగా బతుకుతున్న గిరిపుత్రులు సహాయం చేయాలని, ఈ ఊరులో ఉన్న అందరకి మంచి విద్య, సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చే పధకాలు ఎప్పటికప్పుడు వీరికి వివరించి వీరు ఉన్నతమైన జీవనం కొనసాగించేలా తన ప్రయత్నం చేస్తున్నానని గత 32 ఏళ్లుగా తన పుట్టుపూర్వత్రాలు తెలియకుండా గిరిజనులలో ఒకడిగా బతుకుతున్న తనకు మీ ద్వారా తన చరిత్ర చెప్పుకోక తప్పలేదని అలోక్ సాగర్ అతడి గురించి చెప్పడంతో దేశం మొత్తం నివ్వెరపోయేలా అతడివైపు చూస్తుంది.

ఇక్కడ విశేషమేమిటంటే వారిలో అలోక్ సాగర్ ఎంతలా కలసిపోయాడంటే ఆ చుట్టు పక్కల ఉన్న గిరిజన ప్రాంతాల వారికి ఇతను చెప్పిందే వేదం, అతడి బాటలో కొన్ని వందల కుటుంబాలు నడుస్తున్నాయి. అక్కడ నుంచి అతడిని పంపించివేయాలని చాలా రాజకీయ పార్టీ నాయకులు ప్రయత్నించారు. అతడు ఎవరకి చెబితే వారికి ఆ గిరిజన పుత్రుల ఓటు. కానీ అతడిని అక్కడ నుంచి పంపించివేయడం ఏ రాజకీయ నాయకుడికి కుదరలేదు. ఒక ప్రాంతం నుంచి ఒక వ్యక్తిని పంపించి వేయడం ఎవరకి హక్కు లేదు కదా. ఇప్పుడు అతడి చరిత్ర తెలియడంతో ఆ ప్రాంత రాజకీయ నాయకులు షాక్ కు గురవుతున్నారని అయితే కచ్చితంగా చెప్పుకోవచ్చు.