కరోనా వైరస్ వల్ల ప్రపంచం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 210 దేశాలకు ఈ వైరస్ సోకడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు కరోనా భారిన పడిన దేశాలన్నీ లాక్ డౌన్ ను నిర్వహిస్తున్నాయి. దీంతో రవాణా వ్యవస్థలు, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోతున్నాయి. దీంతో లక్షలాది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు. అయితే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ 75 వేల మంది ఉద్యోగులను(పార్ట్ టైం, ఫుల్ టైం) నియమించుకోబోతుంది. కరోనా సమయంలో ఆర్డర్ల డిమాండ్ భారీగా పుంజుకోవడంతో భారీస్థాయిలో కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది.

ఇప్పటికే అమెరికాలో లక్ష మంది ఉద్యోగులను నియమించుకున్న అమెజాన్.. మరో 75 వేల మందిని నియమించుకోబోతుంది. అంతేకాక అక్కడ పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేతనాల పెంపుకోసం మొత్తం ఖర్చును 500 మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని సంస్థ గిడ్డంగుల నుండి సరుకు రవాణా కోసం అత్యధిక మందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు కంపెనీ తెలియచేసింది. కేవలం అత్యవసర (ఎమర్జన్సీ ఉత్పత్తులు) ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ఆర్డర్లు తీసుకోవడంతో పాటు వాటి డెలివరీని కూడా నిర్ణీత సమయంలో అందిస్తామని స్పష్టం చేసింది. ఇక ఉద్యోగుల భద్రత చర్యలను కూడా ఖచ్చితంగా పాటిస్తామని అమెజాన్ తెలిపింది.