కరోనా వైరస్ ప్రపంచదేశాలను తీవ్రంగా వణికిస్తోంది. ఈ వైరస్ చైనాలో కాస్త నెమ్మదించినా.. అమెరికా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్, బ్రిటన్ దేశాలలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆ దేశాలలో సంభవిస్తున్న మరణాలు చూస్తుంటే మిగతా దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కాగా అమెరికాలో మరణాల రేటు కంటే భారత్ లోనే మరణాల రేటు ఎక్కువుగా ఉందట.

సోమవారం నమోదైన లెక్కల ప్రకారం ఈ వైరస్ సోకిన వారిలో అమెరికాలో ఈ మరణాల రేటు 1.74 గా ఉండగా, భారత్ లో 2.70 గా ఉంది. ఇది ప్రపంచ సగటు రేటు 4.69 కంటే తక్కువే అయినప్పటికీ చాలా దేశాలలో పోలిస్తే ఇది ఎక్కువేనట. ఇక జర్మనీ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువుగా ఉన్న మరణాల రేటు 0.8 శాతానికి పరిమితమైంది. ఇప్పటివరకు భారత్ లో 35 వేల మందికి పరీక్షలు జరపగా అందులో 1024 మందికి పాజిటివ్ గా తేలింది. అంటే అనుమానిత కేసుల్లో 2.92 శాతం మందిలో ఈ వైరస్ ఉంది.

ఇక చైనా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్, బ్రిటన్ దేశాలలో మరణాలు నాలుగు శాతం నుండి 11 శాతం వరకు నమోదైనాయి. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువుగా ఉంది. సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ చెప్పిన సూచనలు పాటించడం వల్ల ఈ వైరస్ ను పూర్తిగా అరికట్టవచ్చంటున్నారు నిపుణులు.