దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైతే, ఆ సమయంలో తన తాత స్థాపించిన పార్టీని కాపాడే బాధ్యత తాను తీసుకుంటానని 2009 సార్వత్రిక ఎన్నికల ముందు మొత్తం బాధ్యతలు తన మీద వేసుకొని ఉత్తేజభరితమైన ప్రసంగాలతో కాంగ్రెస్ నాయకులకు ఒకరకంగా చుక్కలు చూపించాడు.

అప్పట్లో చంద్రబాబు నాయుడు – ఎన్టీఆర్ ఇద్దరు ఆత్మీయమైన బంధంతో మామ, అల్లుళ్లుగా వ్యవహరించేవారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన మామయ్య చంద్రబాబు నాయుడు అంటూ ఎంతో ప్రేమగా ఉండేవాడు. అప్పటి వరకు జూనియర్ అవసరం లేదనుకున్న వారు, అతనికున్న మాస్ ఇమేజ్ చూసి ఒక్కసారిగా దగ్గరకు తీయడంతో అతను కూడా మురిసిపోయి ఉండవచ్చు. ఎన్నికలు ముగిశాయి… తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది.

జూనియర్ ఎన్టీఆర్ కష్టం ఫలించలేదు. చంద్రబాబు నాయుడుకి అధికారం దాదాపు దగ్గరగా వచ్చి చేజారిపోయింది. వెంటనే రాజశేఖర్ రెడ్డి చనిపోవడం, చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ అమెరికా చదువులు ముగించుకొని ఇండియా తిరిగి వచ్చి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండటంతో అసలు కథ మొదలయింది.

ఇక అప్పటి వరకు మామ, అల్లుళ్లుగా ఉన్న చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య లుకలుకలు రావడం మెల్లగా తన కొడుకు కోసం ఎన్టీఆర్ ను దూరం పెట్టడం… ఎన్టీఆర్ ను దూరం పెట్టారన్న ఆక్రోశంతో ఎన్టీఆర్ ను ప్రాణంగా ప్రేమించే కోడలి నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ చేరడం చకచకా జరిగిపోయాయి. కానీ 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవడంతో జూనియర్ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారడమే కాకుండా నారా లోకేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేయాలని భావించడంతో పాటు, అతనిపై లేనిపోని ట్రోలింగ్ చేయడంతో జూనియర్ రాజకీయాల నుంచి పూర్తిగా పట్టించుకోవడం మానేసి, సినిమాలకే పరిమితమవ్వడం.

కట్ చేస్తే 2019 లో తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేనటువంటి దారుణంగా ఓడిపోవడం, ఒకవైపున పార్టీని భుజాన వేసుకొని నడుపుతాడని భావించిన నారా లోకేష్ బాబు మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోవడంతో పార్టీలో స్థబ్ధత ఏర్పడటంతో… జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీలో మరోసారి యాక్టీవ్ చేయాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి రావడంతో… నారా లోకేష్ మరోసారి తన పాత్ర లేకుండా చంద్రబాబు చిన్నల్లుడు… భరత్ ద్వారా అసలు ఎన్టీఆర్ తో తమకేమి పనని వ్యాఖ్యానాలు చేయించడంతో తెలుగుదేశంలో పెద్ద చర్చ రేగింది.

ఈ సందర్బంగా లోకేష్ బాబు ఒక సభలో మాట్లాడుతుండగా అభిమానులు ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని గొడవ చేస్తుంటే ఎన్టీఆర్ పేరు పైకెత్తకుండా ఎవరైనా పార్టీలో పని చేయవచ్చని ముక్తసరిగా మాట్లాడి ముగించారు. జూనియర్ పేరెత్తితేనే అసహనంగా భావించే నారా లోకేష్ నెమ్మదిగా మాట్లాడటం వెనక, లోకేష్ వచ్చే రోజులలో తన రాజకీయ భవిష్యత్తుపై కూడా భయం వేసిందేమో.

మనం ఎన్ని చెప్పుకున్నా… జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ముందు తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు సరితూగరు. నారా లోకేష్ అయితే అసలు దరిదాపులోకి రాడు. ఆ విషయం తెలుగుదేశం శ్రేణులకు కూడా తెలుసు. తమ తెలుగుదేశం పార్టీ ఎప్పటికి నిటారుగా ధ్వజస్తంభంలా నిలబడాలంటే ఆ పార్టీని కాపాడే ఒకే ఒక్కడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్… ఆ నినాదమే తెలుగుదేశం పార్టీని ఉత్తేజ పరుస్తుంది.

కానీ ఎన్టీఆర్ ఇంత రచ్చ జరిగిన తరువాత తెలుగుదేశం పార్టీలోకి వస్తాడా రాజకీయాలలో ఏదైనా సాధ్యమే… అందులో ఎన్టీఆర్ లాంటి వాడిని మచ్చిక చేసుకోవడం మరింత సులువని చెబుతున్నారు. ఎన్టీఆర్ కు ప్రేమలు ఆప్యాయతలంటే వల్లమాలిన ప్రేమట. ఆ ప్రేమలు ఆప్యాయతలు, ఆ కుటుంబ బాంధవ్యాలను ఎరగా వేసి చంద్రబాబు నాయుడు మరోసారి ఎన్టీఆర్ ను వాడుకునే అవకాశం లేకపోలేదు. ఎన్టీఆర్ మరీ అంత మెచూరిటీ లేకుండా ఉంటాడా? గతంలో జరిగిన అవమానాలు మర్చిపోయాడు? ఏమో కాలమే నిర్ణయించాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •