గత తెలుగుదేశం ప్రభుత్వం సీఎస్ ను ముందు పెట్టుకొని చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఎన్నికలను తమకు అనుకూలంగా జరిపించుకోవాలని చూస్తుందని అప్పట్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాది చేయడంతో ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ గా ఆంధ్రప్రదేశ్ కు నియమించి ఎన్నికలు సజావుగా జరిగేలా చేసింది. ఆ తరువాత జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఎల్వీ సుబ్రహ్మణ్యంనే సీఎస్ గా కొనసాగాడు. సీఎం జగన్ కూడా ఎల్వీ సుబ్రహ్మణ్యంతో “అన్న నన్ను మీరే ముందుండి నడిపించాలి” అని అన్నాడు. వారిద్దరూ మధ్య ఎలాంటి గొడవలు లేకుండా చాల చనువుగా అధికార కార్యక్రమాలు కూడా సజావుగా సాగిపోయేవి.

కట్ చేస్తే కొన్ని రోజుల క్రితం సీబీఐ కోర్ట్ సీఎం జగన్ సాక్షులను ప్రభావితం చేస్తాడని అందుకని ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరు కావలసిందే అని సీఎం అయినంత మాత్రాన ఊరట ఇవ్వవలసిన పని లేదని సీబీఐ న్యాయవాదులు వేధించడంతో, వారి వాదనకు అనుకూలంగా సీఎం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని కోర్టు తెలియచేసింది. ఇక జగన్ కేసులలో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా సహా నిందితుడు. EMMAR ప్రాపర్టీస్ కు సంబంధించి ఎల్వీ సుబ్రహ్మణ్యం గతంలో సీఎం జగన్ తో పాటు ప్రతి వారం కోర్టుకి హాజరయ్యేవారు. కానీ తరువాత అందులో ఎలాంటి సాక్షాలు లేకపోవడంతో పాటు, కేసులో విషయం లేకపోవడంతో ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఊరటనిచ్చారు.

కానీ సీబీఐ మాత్రం ఏపీ ప్రభుత్వానికి సీఎస్ గా ఉన్న వ్యక్తికి… గతం నుంచే జగన్ తో సంబంధాలు ఉన్నాయని వారిద్దరూ కలసి సాక్షులను ప్రభావితం చేయవచ్చని భావిస్తుందని సీఎం జగన్ కు ఎక్కడో అనుమానం వచ్చినట్లుంది. అందుకే తనకు ఊరట లభించడం లేదని, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నంత కాలం తనకు ఊరట లభించదని భావించి ఉండవచ్చు. అందుకే హైకోర్టు లో జగన్ కొత్తగా తనకు ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కే బాధ నుంచి ఉపశమనం కలిగించమని పిటిషన్ వేయడంతో పాటు ఎల్వీ సుబ్రహ్మణ్యంను కూడా తీసి పక్కన పెట్టినట్లు వాదనలు వినపడుతున్నాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యంను పక్కన పెట్టడం వలన తాను సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదని కోర్టుకు విన్నవించుకోవాలని అనుకున్నాడా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరోవైపున ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది కేంద్ర ప్రభుత్వమని, అతడికి మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉండటం వలన ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న వాటిని ఎప్పటికప్పుడు కేంద్రానికి అందచేస్తున్నాడని కూడా జగన్ ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. దీనితో ఎల్వీ సుబ్రహ్మణ్యంను తప్పించడం వలన ఈ రెండు కారణాలు బలంగా పని చేశాయని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యంను మాత్రం బాపట్ల హెచ్ఆర్డీఐకు ట్రాన్స్ఫర్ చేసినా అతడు వచ్చే నెల అక్టోబర్ 6 వరకు బదిలీపై వెళ్ళాడు. ఇక తనకు ఎలాగూ కేంద్రంలో మంచి పట్టు ఉండటంతో కేంద్ర ప్రభుత్వంలో తనకు మిగిలి ఉన్న చివరి ఐదు నెలల సర్వీస్ లో కేంద్రంలో పని చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం కూడా ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మంచి పదవి కట్టబెట్టేందుకు సుముఖంగా ఉందన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి.