అవినీతి ఎంతలా పెరిగిపోయిందో ఈ ఉదంతం చూస్తేనే తెలుస్తుంది. నాకు వద్దురా బాబోయ్ అన్నా వచ్చి తన  వాకిట్లో డబ్బులు ఉంటే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. ఇప్పుడు ఇలాంటి సంఘటనలే ఏపీలో కొత్తగా అధికారాన్ని చేపట్టిన మంత్రులకు ఎదురవుతుందట. 

కొత్తగా మంత్రి పదవిని చేపట్టిన ఒక మంత్రి…  తమ నాయకుడు సీఎం జగన్ చెప్పినట్లు అవినీతిలేని రాజ్యం కోసం కృషి చేద్దామంటే నెలతిరిగేసరికి ఇంటికి రెండు కోట్లు వచ్చి చేరుతున్నాయట. అదేమంటే ఇదంతా కామన్ అంటున్నారట. మరి మా నాయకుడు ఒప్పుకోడే అంటే మీ నాయకుడికి ఇష్టం లేకున్నా లెక్క ముట్టచెప్పాల్సిందే అంటున్నారట. అంటే ఎంతలా ప్రభుత్వ శాఖలలో అవినీతి రాజ్యమేలుతుందో ఈ ఉదంతమే చెబుతుంది. పాపం ఆ మంత్రికి ఇష్టం లేకపోయినా, తమ నాయకుడు సీఎం జగన్ కు తెలిస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తాడని తెలిసినా “లచ్చిమ్ దేవి” ఇంటికొచ్చి తలుపుకొడుతుంటే ఎవరు కాదంటారు చెప్పండి.

ఇక మరో మంత్రి పరిస్థితి మరొకరకంగా ఉంది. త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పైరవీలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఒక మంత్రికి ఒక మహిళా ఆఫర్ ఇస్తూ తనకు మేయర్ పదవిని ఇప్పిస్తే ఐదు కోట్ల రూపాయలు ముట్టచెబుతానని ఆఫర్ ఇచ్చిందట. ఐదు కోట్లా ఆమ్మో అనుకునేలోపే… సీఎం జగన్ గుర్తుకు వచ్చాడు. అసలు తాను ఒక మంత్రిని మాత్రమే, రేపు జరిగే ఎన్నికలలో గెలిపొందితే మేయర్ అభ్యర్థిని డిసైడ్ చేయవలసిందే సీఎం జగన్.. కానీ తనకు ఎట్లా సాధ్యమవుతుంది అబ్బా అనుకుంటూనే… ఐదు కోట్ల రూపాయలు తనను వెనకడుగు వేయనియ్యలేదట. ప్రస్తుతానికి మాట సాయం చేసి, నా వంతు నేను ప్రయత్నాలు చేస్తానని చెప్పారట.

ఈ రెండు ఉదంతాలే చెప్పడం లేదా? పరిస్థితి ఎంతలా దారుణంగా తయారైందో… సీఎం జగన్ అవినీతి లేని రాజ్యం చూడాలని రోజు ఎస్పీలు, కలెక్టర్లకు ఎంతలా క్లాస్ తీసుకుంటున్నా… తమ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు గట్టిగా చెబుతున్నా అవినీతి పరులు మాత్రం ఏదో ఒక రకంగా బుట్టలో వేసుకొని తమ పనులు సాఫీగా సాగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీఎం జగన్ మొండోడని, ఇప్పటికే అలాంటివి ఒకటి రెండు గమనించి పూర్తి నివేదిక తెప్పించుకున్న తరువాత డబ్బులు వాపస్ ఇప్పించాడన్న కథనాలు కూడా వినపడుతున్నాయి. జగన్ అవినీతి చేయవద్దని ఇంతలా గొడవ చూస్తుంటేనే అలా ఉంది… అసలు జగన్ అవినీతి గురించి మాట్లాడకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో… అంతా “లచ్చిమ్ దేవి మహిమ”                

 
  •  
  •  
  •  
  •  
  •  
  •