జనవరి 7, 2010 ఆరోజు సాయంత్రం ఒక్కసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్య వెనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నట్లు వార్తలు రావడంతో వైఎస్ఆర్ సపోర్టర్స్ ఒక్కసారిగా ఆగ్రహంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో పాటు రిలయన్స్ కు సంబంధించిన చాల వాటిపై దాడులకు దిగారు. ఆ సమయంలో కొన్ని చోట్ల రిలయన్స్ టవర్లకు కూడా హాని తలపెట్టారు.

దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వందల మందిపై కేసులు పెట్టారు. రిలయన్స్ సంస్థ కూడా తరువాత పేపర్లలో మాజీ సీఎం హత్యపై జరుగుతున్న ప్రచారం అంతా దృష్ప్రచారమని తెలియచేసారు. దీనిపై అప్పటి నుంచి చాల మంది కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులకు ఒక ముగింపు ఇస్తూ, ఆ కేసులను ఎత్తేయాలని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక వీటితో పాటు గతంలో కాపులకు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తానన్న రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోకపోవడంతో తునిలో జరిగిన అల్లర్లు, పోలీస్ స్టేషన్ ముట్టడి, రైలు దుర్ఘటనకు సంబంధించిన కేసులను కూడా ఎత్తివేయాలని చూస్తున్నారు. తుని సంఘటనకు సంబంధించి అల్లరి మూకలతో పాటు ఎటువంటి పాత్ర లేని చాలామంది కేసులో ఇరుక్కుని ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు తుని రైలు దుర్ఘటన, రిలియన్స్ కేసులకు సంబంధించి కేసులను ఎత్తివేస్తే చాల మందికు రాష్ట్రవ్యాప్తంగా ఊరట అని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రభుత్వం ఈ రెండు కేసులకు సంబంధించి కేసులు ఎత్తివేస్తుందా లేదా అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.