కడప కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అనేది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని అది 13 జిల్లాలకు విస్తరించాలన్నారు. రాయలసీమలో హైకోర్ట్ ఏర్పాటు చెయ్యాలనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన వెల్లడించారు.

యురేనియం కాలుష్యం వల్ల జరిగే అనర్ధాల పరిష్కరానికి ప్రతి నెల యూసీఐఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని బుగ్గన తెలియచేశారు. అలాగే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే వరదలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బుగ్గనతో పాటు పిల్లి సుభాస్ చంద్రబోస్, శ్రీరంగనాధ రాజు పాల్గొన్నారు.