రానున్న లోక్ సభ ఎన్నికలలో వైసీపీ తనను ఆహ్వానిస్తే ఆ పార్టీకి ప్రచారం చేయడానికి తాను సిద్ధం అన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. ఈ నేపథ్యంలో ఓవైసీ గెలుపు గుర్రాల గురించి చెప్పుకొచ్చాడు. దారుసాలెంలో శనివారం జరిగిన ఎంఐఎం 61వ ఆవిర్భావ సభలో అసద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలను భూస్థాపితం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తెరాస, వైసీపీ 35 సీట్లు సాధించే అవకాశం ఉందన్న ఆయన.. మైనార్టీలంతా వైసీపీ వెంటే ఉన్నారని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిస్తే తాను ప్రచారానికి వస్తానన్నారు.

పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ స్పందించారు. టిప్పు సుల్తాన్‌ హిందువులకు శత్రువు కాదని అన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ అణుబాంబులు గురించి మాట్లాడుతున్నారని.. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు అసదుద్దీన్‌ ఓవైసీ.