టాలీవుడ్ బడా నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. విజయవాడకు చెందిన అశ్వినీదత్ గతంలో టీడీపీలో పనిచేశారు. చాలా కాలం నుండి టీడీపీ కి దూరంగా ఉంటున్న అశ్వినీదత్.. తాజాగా హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి కలసి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశం లో జోషి మొదటగా ‘మహానటి’ సినిమాపై ప్రశంసలు కురిపించారట. ఇక అశ్వినీదత్ తనకు ప్రధాని మోదీ పాలన చాలా బాగుందని.. ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళుతున్న తీరు చాలా అద్భుతమని కొనియాడారట. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అలాగే వారణాసిని గొప్పగా అభివృద్ధి చేయడం ఇవన్నీ మోదీ వల్లనే సాధ్యమయ్యాయని చెప్పారు. అలాగే మోదీ ప్రభుత్వానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుండి తన వంతు కృషి ఉంటుందని తెలియచేసారు.

తనకు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి సేవ చేయాలని.. బీజేపీలో చేరాలనుకుంటున్నానని దత్తు వారికి తెలిపారట. కానీ ఆయన బీజేపీలోకి ఎప్పుడు చేరతారనేది పూర్తి క్లారిటీ లేదు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. గతంలో వైజయంతి మూవీస్ పతాకంపై అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. గత సంవత్సరం ‘మహానటి’, నాగార్జున-నాని ల ‘దేవదాస్’ సినిమాను తెరకెక్కించారు అశ్వినీదత్.