ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ లేదా మరొక పేరుగా సద్దుల పండుగను జరుపుకుంటారు. బతుకమ్మల చుట్టూ వలయంలా ఏర్పడి చప్పట్లు చరుస్తూ “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అంటూ పాడే పాటలు ఎంతో ఆకర్షిస్తాయి.

తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో చేసుకునే బతుకమ్మ పండుగకు తొమ్మిది నైవేద్యాలను బతుకమ్మకు సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు యువకులు, యువతులు నైవేద్యం తయారీలో పాల్గొంటారు. చివరి రోజు అనగా తొమ్మిదవ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారుచేస్తారు. చివరి రోజుని సద్దుల బతుకమ్మగా కొలుస్తారు.

తొమ్మిది రోజులు పాటు జరిగే ఈ పండుగలో తొమ్మిది నైవేద్యాలు గురించి తెలుసుకుందాం

ఎంగిలి బతుకమ్మ : మహా అమావాస్య రోజు మొదటి రోజు బతుకమ్మ పండుగ మొదలవుతుంది. తెలంగాణాలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు.నువ్వులు, బియ్యపు పిండి, నూకలతో నైవేద్యం తాయారు చేస్తారు.

అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేసుకునే అటుకుల బతుకమ్మకు నైవేద్యంగా సప్పిడి బియ్యం, పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.

నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అట్ల బతుకమ్మ : అట్లును(దోశ) నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ అయిపోయిన నాలుగైదు రోజులకు అట్ల తద్దెను కొత్తగా పెళ్ళైన మహిళలు తమ చుట్టూ పక్కవారిని పిలుచుకొని ఒకొక్కరకి 11 అట్లు ఇచ్చి పంపిస్తారు.

అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి, ఈరోజు నైవేద్యం ఏమి సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేప పండుగా తాయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ : ఎనిమిదవ రోజున వచ్చే వెన్నముద్దల బతుకమ్మకు నువ్వులను నైవేద్యంగా తాయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ : చివరి రోజు తొమ్మిదవ రోజైన సద్దుల బతుకమ్మ రోజు ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు విజయదశమిని జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. చింతపండు పులిహోర, లెమన్ రైస్, పెరుగన్నం, నువ్వులన్నం, కొబ్బరన్నం ఇలా ఐదు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు.

మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలై తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. మొదటి ఎనిమిది రోజులు అత్తవారింట్లో పండుగ చేసుకొని, తొమ్మిదవ రోజు కన్నవారింటికివచ్చి సద్దుల బతుకమ్మను చేసుకుంటారు.