బిగ్ బాస్ తెలుగు 3 ప్రేక్షకులు ఎలా ఓట్లు వేయాలో కూడా బిగ్ బాస్ నే నిర్ణయిస్తున్నాడు. నువ్వు వీళ్లకు ఓటు వేయి, వారికి ఓటు వేయవద్దు… కాదు కాదు ఈ రోజు నీ డెసిషన్ మార్చుకొని ఎవరికైతే ఓటు వేయకూడదనుకున్నావో వారికి ఈరోజు ఓటు వేసి సేఫ్ చేయి ఇది బిగ్ బాస్ గేమ్. ఇదంతా బిగ్ బాస్ ఎలా ఆడుతాడు… ఎలా మనచేత ఓట్లు వేయిస్తాడనే అనుమానం రావచ్చు. అవును మన చేత… మనం ఎవరకి ఓట్లు వేయాలో డిసైడ్ చేసేది కూడా ఒక్క బిగ్ బాస్ మాత్రమే.

బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ నిద్రపోయే ఏడు గంటలు పక్కన పెడితే మిగతా 17 గంటలు వారు ఏమి చేస్తున్నారు, ఎలా హౌస్ లో ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని బిగ్ బాస్ టీమ్ మొత్తం కట్ చేసి వారికి నచ్చిన బైట్ మనకు ఒక గంట సేపు చూపిస్తారు. ఆ గంటలో చూసిన బిగ్ బాస్ హౌస్ సంఘటనలు బట్టి మనం ఓట్లు వేయడం జరుగుతుంది. ఇక బిగ్ బాస్ తన గేమ్ ఇక్కడే మొదలు పెట్టాడు. ఆ గంట సేపు తనకు నచ్చిన వారికి స్క్రీనింగ్ ఇవ్వకుండా తనకు నచ్చని వారిని ఎక్కువగా ఎక్కడైతే గొడవలకు దిగుతూ రచ్చ చేస్తారో వారి వైపు కెమెరాలను ఫోకస్ చేసి మన మీద వదులుతాడు. ఇక మనం ఆమ్మో నిజంగానే ఇలా జరిగిపోతుందా బిగ్ బాస్ లో అని వారికి ఓటుకి వేయడానికి ఇష్టపడం. 

ఈ వారం బిగ్ బాస్ హౌస్ ను గమనిస్తే ఇలాంటి సంఘటనలు ఒకటి, రెండు ఉన్నాయి. వరుణ్ – వితికలు జంటగా హౌస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక హౌస్ లో వితిక యాటిట్యూడ్ పట్ల ఇంటా బయట బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులలో అసహనం కలిగింది. కావాలని గొడవలు పెట్టుకోవడం… నోరేసుకొని అరవడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న క్రమంలో వితిక ఈ వారం కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. ఇక బిగ్ బాస్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఈ విషయాన్ని పసిగట్టి వితికకు మనకు చూపించే ఎపిసోడ్ లో స్పేస్ తగ్గించేసి తమన్నా సింహాద్రిని లైమ్ లైట్ లోకి తీసుకువచ్చి ప్రేక్షకుల మైండ్ సెట్ మార్చేశాడు. 

వరుణ్ – వితికలతో బిగ్ బాస్ హౌస్ లో చేయించవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే వితిక వెళితే ఒక జంటను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చి వెంటనే పంపించడంతో ఎలాంటి ఉపయోగం లేదని భావించే ఇలా చేస్తున్నాడు. ఇక అలానే రాహుల్ సిప్లిగంజ్ చేత సీక్రెట్ టాస్క్ ఆడించి… ఆ టాస్క్ ను గాలికి వదిలేశారు. ఇలా ఇప్పుడే కాదు బిగ్ బాస్ మొదలు పెట్టిన మొదటి నుంచి ఈ ఆరోపణలు ఉన్నాయి. ఇక బిగ్ బాస్ 2 లో ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎలిమినేట్ అయిన తరువాత బయటకు వచ్చిన వారు ప్రేక్షకులకు చూపించిన గంట సేపటి ఎపిసోడ్ చూసుకొని గుండెలు బాదుకున్నారు. 

బిగ్ బాస్ హౌస్ లో ఇంకా చాల జరుగుతుందని అదంతా బయట పెట్టకుండా ప్రేక్షకుల ముందు తనను విలన్ గా చూపిస్తున్నారని చెప్పారు. ఇక బిగ్ బాస్ 3 తెలుగు మొదటి వారం బయటకు వెళ్లిపోయిన హేమ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. బిగ్ బాస్ లో ఎన్నో విషయాలు జరుగుతున్నా చూపించకుండా తనకు కిచెన్ లో జరిగిన గొడవ ఒక్కటే ప్రేక్షకులకు చూపించి  తనను విలన్ గా బిగ్ బాస్ ముద్రవేశాడని ఆరోపించింది. బిగ్ బాస్ పైసలు పెట్టి కంటెస్టెంట్స్ ను కొనుకున్నాక వారిని గిట్టుబాటు చేసుకోకుండా అలా ఎలా పంపిస్తాడు. బిగ్ బాస్ ఆడే నాటకంలో మనలను పాత్రధారులను చేసి సూత్రధారిగా బిగ్ బాస్ పర్ఫెక్ట్ బిగ్గర్ బాస్ గేమ్ ఆడుతున్నాడు.

అందుకే ఈ వారం వితికను సేఫ్ చేసి… బాబా భాస్కర్ తో కలసి అప్పుడప్పుడు ఫన్నీ స్కిట్స్ చేస్తున్న జాఫర్ కు వితిక కన్నా తక్కువ ఓట్ల కారణంగా బలి చేస్తున్నాడు. “ముఖా ముఖి” ప్రోగ్రాం తో రాజకీయ, సినీ రంగానికి చెందిన వారిని ఒక ఆట ఆడుకునే జాఫర్ దీనిపై ఏమైనా ప్రోగ్రాం చేస్తాడేమో చూడాలి. 
  •  
  •  
  •  
  •  
  •  
  •