బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) మృతి చెందారు. గత నెల రోజుల కిందట కరోనా సోకగా ఏలూరు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో వారం క్రితమే విజయవాడలోని ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. ఇక వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో శనివారం తుది శ్వాస విడిచారు. మాణిక్యాలరావుకు భార్య సూర్యకుమారి, కూతురు సింధు ఉన్నారు.

2014 ఎన్నికలలో బీజేపీ-టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేసి.. చివరి వరకూ అదే పార్టీలో కొనసాగారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.