వైఎస్ జగన్ తో నిన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం సమావేశానంతరం దీనిపై అనేక రకాల చర్చలు మొదలయ్యాయి. ఈ భేటీకి సంబంధించి తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీరిద్దరి సమావేశం ముగిసిన వెంటనే తెలుగుదేశం నేతలు మీడియా గొట్టాల ముందుకు వచ్చి కేసీఆర్, వైఎస్ జగన్ లను తూర్పార పడుతూ తెలంగాణ ముఖ్యమంత్రితో జగన్ ఎలా స్నేహం చేస్తారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఇక ఇదే భేటీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ విజయవాడకు చెందిన బుద్ధా వెంకన్న మీడియా ముందుకు వచ్చి ఏపీలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి మోదీ పావులు కదుపుతున్నాడని, అందులో భాగంగానే నిన్న కేటీఆర్, వైఎస్ జగన్ తో చర్చలు జరిపాడని, వీరిద్దరి భేటీ వెనుక మోదీ కీలకంగా వ్యవహరించాడని చెప్పుకొచ్చారు. బీజేపీ డైరెక్షన్ లో కేసీఆర్ నడుస్తూ ముసుగు రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేస్తున్నారని, అసలు ఫెడరల్ ఫ్రంట్ అనేదే లేదని, ఎన్నికల తరువాత ఈ ఫ్రంట్ అంత బిజెపికి భజన చేయడమే అని తీవ్రస్థాయిలో ఆరోపించారు.ఎవరెన్ని కూటములు కట్టినా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 150 స్థానాలు వస్తాయని బుద్ధా వెంకన్న తెలియచేసాడు.