మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను రామ్ చరణ్ 270 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఇక వరుసగా చిరంజీవి 100 కోట్ల మార్కును అందుకున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఆ సినిమాతో 100 కోట్ల మార్కును అధిగమించాడు. ఇప్పుడు ‘సైరా’ తో మళ్ళీ 100 కోట్లను అందుకున్నాడు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తుంది.

ఇక ఈ సినిమా విజయం పై ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడారు. ఈ ‘సైరా’ సినిమా ఓ వ్యాపారాత్మక విజయమే కాకుండా, ఒక చారిత్రాత్మక అవసరమైన విజయంగా నేను భావిస్తున్నాను. జాతిని నడిపించే ఇలాంటి కథలను సృష్టించాలని రచయితలను కోరుతున్నాన్నారు. స్వయం కృషి, ఆపద్బాంధవుడు, పున్నమి నాగు, ప్రాణం ఖరీదు వంటి సినిమాలు చూస్తుంటే చిరంజీవి అభినయానికి హద్దులు లేవని నిరూపించాయన్నారు.

లక్షలాది మందిని ఇన్స్పైర్ చేయగలిగే నటుడు చిరంజీవి మనమధ్యనే ఉన్నాడని.. ఆయనను ఇంకా అరశతాబ్దం పాటు మనం ఉపయోగించుకోవాలన్నారు. తొలి అర్ధ శతాబ్దం వినోదానికి ఉపయోగించుకుందాం.. ఇంకో అర్ధ శతాబ్దం వికాసానికి వినియోగించుకుందాం అన్నారు. ఆయన నుండి ‘సైరా’ లాంటి స్ఫూర్తి దాయకమైన సినిమాలు ఎన్నో రావాలని సీతారామశాస్త్రి అన్నారు.