ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై వారు ఏమాత్రం పట్టు సడలింపు లేకుండా రోజు రోజుకి ఉదృతం చేస్తుండటంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే రీతిలో పట్టుదలగా వచ్చే మూడు రోజులలో 100 శాతం బస్సులు నడవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఈరోజు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు.

రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లు, బారి వాహనాలు నడిపిన అనుభవమున్న వారిని పనిలోకి తీసుకొని బస్సులను నడపాలని, అన్ని బస్సులు మూడు రోజులలో రోడెక్కాలని చట్టవిరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని, అలాంటి సమ్మెను గుర్తించవలసిన పని లేదని కేసీఆర్ అన్నారు.

ఇక అధికారులు కూడా కేసీఆర్ చెప్పినట్లు అన్ని బస్సులను నడిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెవీ వెహికల్ డ్రైవర్ల కోసం జల్లెడ పడుతున్నారు. ఒకవేళ కేసీఆర్ చెప్పినట్లు అన్ని బస్సులు రోడ్డు మీదకు వస్తే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరమనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు దిగి రాకుండా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు దిగి రాక తప్పని పరిస్థితి నెలకొని ఉంటుంది.

రేపటి నుంచి ఆర్టీసీ సమ్మెను ఉదృతం చేసేదానిలో భాగంగా రేపు అనగా 13న రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు, 14న అన్ని డిపోల ఎదుట బైఠాయింపు, బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న ఐకాసాకి మద్దతుగా ర్యాలీలు, 17న ధూమ్ ధామ్ కార్యక్రమాలు, 18న బైక్ ర్యాలీలు, 19న తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.