తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు విలువ లేకుండా పోయిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. 40 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరగడం దేశంలో ఇదే తొలిసారని.. ఎప్పుడు జరగలేదన్నారు. కళ్ళున్నా చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇదని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఇప్పటికే చాలా మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఈ రోజు కూడా నరేష్ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా భాదగా ఉందన్నారు.

ఇంకా ఎన్ని రోజులు సమ్మె జరుగుతుందో తెలియడం లేదన్న జగ్గారెడ్డి.. తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవన్న కేసీఆర్ మరి ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలు చూసి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ ఆర్టీసీ సమ్మెను బలహీనుడికి, బలవంతుడికి జరుగుతున్న పోరాటముగా అభివర్ణించిన జగ్గారెడ్డి.. భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో చూడాలని అన్నారు. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ సమస్యకు పరిస్కారం దొరకడంలేదని.. తక్కువ జీతాలు ఉన్న కార్మికులు ఇప్పటికే అనారోగ్య కారణాలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. అసలు రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.