మహాకూటమిలో విబేధాలు రోజు రోజుకి రచ్చకెక్కుతున్నాయి. కేసీఆర్ కు వ్యతిరేకమగా పురుడు పోసుకున్న మహాకూటమిలో సీట్ల లొల్లి తారాస్థాయికి చేరి సీపీఐ పార్టీ కూటమి నుంచి బయటకు రావడానికి సిద్ధమవుతుంది. మహాకూటమిలో ఇచ్చి పుచ్చుకొనేలా ఉండాలని తామే చెప్పామని, కూటమి బలోపేతంకు చాలా ఆలస్యం అయిందని, సిపిఐ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తొమ్మిది సీట్లలో పోటీ చేయబోతున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.

కొత్త గూడెం, వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్, ఆలేరు, మంచిర్యాల, మునుగోడు, దేవరకొండ, పినపాక నియోజకవర్గాలలో తాము పోటీ చేసి తీరుతామని చాడ వెంకటరెడ్డి తెలియచేసారు. కాంగ్రెస్ ముందు తాము ఈ జాబితాను పెట్టామని, మా తొమ్మిది స్థానాల గురించి కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆలోచన చేస్తే కూటమిలో ఉంటామని లేకపోతే బయటకు వెళ్లి తాము 24 స్థానాలలో పోటీ చేస్తామని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేసారు. తమకు తెలంగాణ వ్యాప్తంగా 40 స్థానాలలో బలం ఉందని, తమను కాదనుకుంటే తమ సత్తా ఏమిటో ఎన్నికలలో చూపిస్తామని చాడా వెంకట రెడ్డి అన్నారు.

చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యలతో సిపిఐ దాదాపుగా కూటమి నుంచి బయటకు వచ్చినట్లే అనుకోవాలి. కనీసం తమకు ఐదు స్థానాలైనా కేటాయించాలని అడిగిన సిపిఐ గురించి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పట్టించుకోకపోవడంతో, ఇప్పుడు సిపిఐ పార్టీ ఏకంగా తొమ్మిది స్థానాలను ప్రకటించి ఈ స్థానాలలో కచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి, ఒకవేళ కూటమి నుంచి బయటకు వస్తే 24 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పడంతో మహాకూటమికి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. మరో వైపు కోదండరాం కూడా తమ సీట్ల పంచాయితీపై క్లారిటీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మహాకూటమి భవిష్యత్ రెండు, మూడు రోజులలో తేలనుంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •