దేవినేని నెహ్రు వారసుడిగా రాజకీయ అరగేంట్రం చేసిన దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికలలో గన్నవరం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు వర్గానికి వ్యతిరేకంగా అప్పట్లో దేవినేని నెహ్రు లక్ష్మి పార్వతి వర్గంలో కొనసాగారు. ఆ తరువాత లక్ష్మి పార్వతి వర్గం కూడా చిన్నాభిన్నం అవ్వడంతో చంద్రబాబు దగ్గరకు వెళ్లడం ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అసలు జీవితంలో తెలుగుదేశం పార్టీ గడప తొక్కనని శపధం చేసిన దేవినేని నెహ్రు తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీతో మరొకసారి కలిసి పనిచేయవలసి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో చేరిన కొన్ని రోజులకే దేవినేని నెహ్రు చనిపోవడంతో అప్పట్లో లోకేష్ బాబు దేవినేని అవినాష్ నా సొంత తమ్ముడిని అతడి రాజకీయ భవిష్యత్ తెలుగుదేశం పార్టీలో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

రేపు చంద్రబాబు నాయుడు విజయవాడలో ధర్నా చౌక్ వేదికగా జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా దీక్ష చేయబోతుంటే దేవినేని అవినాష్ ఆ ఏర్పాట్లలో పాలు పంచుకోకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు. అవినాష్ పార్టీ మారి చంద్రబాబు నాయుడు రేపు చేయబోయే దీక్షకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దేవినేని అవినాష్ ఇంటికి భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో పాటు భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.

దేవినేని అవినాష్ కూడా లోకేష్ బాబు సారధ్యంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని, తాను యువకుడు కావడంతో కొన్నేళ్ల పాటు విజయవాడలో రాజకీయం చేయవలసి ఉండటంతో వైసీపీలో చేరి విజయవాడ తూర్పు పగ్గాలు చేపట్టడానికి తహతహ లాడుతున్నాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ ను పార్టీ మారవద్దని సర్ది చెప్పినా వినే పరిస్థితులు లేవని తెలుస్తుంది.