ఎన్టీఆర్ అంటేనే నటన… నటన అంటేనే ఎన్టీఆర్… ఆ రోజులలో ఒకేసారి నాలుగైదు చిత్రాలలో నటిస్తూ అలవోకగా డైలోగ్స్ ను చెబుతూ డైరెక్టర్లను ఔరా అనిపించేవాడు. అలాంటి ఎన్టీఆర్ కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడు మూడు పాత్రలను అలవోకగా నటించి అందరిని మెప్పించిన సినిమా దాన వీర శూర కర్ణ. ఈ సినిమా జనవరి 14 1977లో విడుదలైంది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాకు దర్శకుడు ఎన్టీఆర్, నిర్మాత ఎన్టీఆర్… ఇలా సినిమాలో మూడు క్లిష్టమైన పాత్రలతో పాటు దర్శక, నిర్మాతగానే కాకుండా కథను తానే స్వయంగా రాసుకొని స్క్రీన్ ప్లే పాత్ర కూడా ఎన్టీఆర్ నే రూపొందించారు.

ఈ సినిమాకు ఆరోజులలో ఖర్చు 10 లక్షల రూపాయలైందట. 10 లక్షల రూపాయలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టినట్లే. కానీ ఆ సినిమా థియేటర్ లలో విడుదలైన తరువాత ఒక ప్రభంజనం ఎన్నో రోజులు టికెట్లు దొరక్క ఎంతో మంది ఎన్టీఆర్ అభిమానులు సినిమా చూడటానికి పడిగాపులు పడేవారట. ఈ సినిమా కోటి రూపాయలకు పైగా కలెక్ట్ చేసి ఆరోజులలో సినిమా ఇండస్ట్రీ జనాల్ని ఆశ్చర్య పరిచింది. ఇక ఈ సినిమా మీద ప్రేక్షకులలో ప్రేమ చావకపోవడంతో మరోసారి 1994లో ఈ సినిమాను రెండవ సారి విడుదల చేస్తే అప్పుడు కూడా రిలీజ్ సినిమాకు ఎగబడినట్లు ప్రేక్షకులు చూడటంతో మరోసారి కోటి రూపాయలు కలెక్ట్ చేసింది.

జనవరి 14 1977లో 14 ప్రింటులు, 15న మరొక 16 ప్రింటులు మొత్తం 30 ప్రింటులతో విడుదలై కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. రెండవ సారి సినిమా 1994లో విడుదలైనప్పుడు కూడా అదే 30 ప్రింటులతో విడుదలై మరొక కోటి రూపాయలు సంపాదించడం గమనార్హం.

దాన వీర శూర కర్ణ సినిమాను కేవలం 43 రోజులలోనే నిర్మించి విడుదల చేయడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి కాలంలో “దాన వీర శూర కర్ణ” సినిమాను నిర్మించాలంటే దాదాపుగా రెండేళ్ల సమయం దర్శకులు తీసుకుంటారు. ఎలాంటి టెక్నికల్ హంగులు లేని రోజులలోనే సినిమాను అద్భుతంగా తీసి మైమరచిపోయి డైలాగ్స్ తో ప్రేక్షకులను అబ్బురపరిచింది.

ఇప్పటికి టీవీలో “దాన వీర శూర కర్ణ” సీన్ వస్తే మంచి రేటింగ్స్ ఉంటాయి. ఈ సినిమా నిడివి కూడా దాదాపుగా 3 గంటల 56 నిముషాలు అంటే ఈరోజులలో రెండు సినిమాలతో సమానం. అంత నిడివి గల సినిమాను ప్రేక్షుకులు ఎలాంటి విసుగు చెందకుండా చూశారంటే ఎన్టీఆర్ నటనతో పాటు, అతడి డైరెక్షన్ అమోఘం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇండియాలో 6 వ అతి పెద్ద నిడివి గల సినిమాగా రికార్డులలోకి ఎక్కింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, సరోజ దేవి, ప్రభ, చలపతిరావు మరికొంత మంది ప్రముఖులు పోషించారు. ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ, హరికృష్ణకు మేకప్ స్వయంగా ఎన్టీఆర్ వేసేవారట. బాలకృష్ణ, హరికృష్ణ కలసి నటించిన చివరి చిత్రం “దాన వీర శూర కర్ణ”, అంతకు ముందు ఇద్దరు కలసి “తాతమ్మ కథ”లో నటించారు.

ఈ సినిమాకు డైలాగ్స్ అందించిన కొండవీటి వెంకటకవికి ఇదే మొదటి సినిమా అయన అంతకు ముందు సాంస్కృతిక కళాశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసేవారట. సంగీతాన్ని పెండ్యాల నాగేశ్వర రావు రూపొందించారు. ఎన్టీఆర్ సొంత బ్యానర్ “రామకృష్ణ సినీ స్టూడియోస్” పై నిర్మించిన ఈ సినిమా రామోజీరావు “మయూరి” డిస్ట్రిబ్యూషన్ సంస్థపై విడుదలైంది.