గత ఎన్నికలలో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి దాదాపుగా 60 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన అమర్ రాజా బ్యాటరీస్ అధినేత గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికలలో పార్లమెంట్ స్థానాన్ని విడిచి తెనాలి అసెంబ్లీకి పోటీ చేయడానికి ముందుకొచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం తెనాలి ఎమ్మెల్యేగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వచ్చే ఎన్నికలలో గుంటూరు 2 నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతుండగా, తెనాలి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి గల్లా జయదేవ్ ఆసక్తి చూపిస్తున్నారు.

మరోవైపున గల్లా జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కూడా తెనాలి అసెంబ్లీ బరిలో ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలతో వచ్చే ఎన్నికలలో తల్లి, కొడుకులు ఇద్దరిలో ఎవరో ఒకరు తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన హీరో మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న గుసగుసలు వినపడటంతో గల్లా ఫ్యామిలీ తెనాలిపై కన్ను వేయడం ఆసక్తిగా ఉంది.

తెనాలి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో వైసిపి గెలిచే సూచనలు కనపడుతున్నాయని అందరూ భావిస్తున్న తరుణంలో ఆలపాటి రాజా చేసిన అక్రమాలతో కొంతైనా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవడానికే ప్రధానంగా ఈ మార్పు జరిగినట్లు వినికిడి. గల్లా కుటుంబం కనుక వచ్చే ఎన్నికలలో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే జనసేన, వైసిపి, టీడీపీ పార్టీల మధ్య పోటీ ఆసక్తిదాయకంగా ఉండే అవకాశం కనపడుతుంది.