గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటుంది. 2009లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఎప్పుడైతే కొత్త పార్టీ పెట్టుకున్నాడో అప్పటి నుంచి జగన్ ను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న నేతలు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. గత పదేళ్లుగా పడిన కష్టాలకు వైసీపీ అద్భుతమైన మెజారిటీతో గెలవడంతో పటాపంచలైపోయాయని ఆనందం వ్యక్తం చేసేలోపు ఎవరైతే గత పదేళ్లుగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడో ఆ నాయకుడు ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరి వైసీపీని నమ్ముకున్న కార్యకర్తలకు మింగుడు పడనియ్యకుండా చేస్తున్నాడు.

ముందుగా గత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభంజనం ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్న వేళ గన్నవరంలో కూడా ఈసారి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మంచి మెజారిటీతో గెలిచే అవకాశముందని సర్వేలు తేల్చి చెప్పడంతో వల్లభనేని వంశీ ఏకంగా వైసీపీ అభ్యర్ధికి ఫోన్ చేసి నువ్వు నామినేషన్ వేయడానికి వెళ్తున్నావంట కదా నీకు శుభాకాంక్షలు అంటూ బెదిరించే రీతిలో మాట్లాడారు. యార్లగడ్డ వెంకట్రావుతో పాటు టీడీపీ పార్టీ నుంచి వైసీపీలో చేరిన దాసరి బాలవర్ధనరావు అతడి సోదరుడు దాసరి జైరమేష్ ను ఇబ్బందులకు గురి చేసేలా వంశీ వ్యవహరించారు.

కానీ అప్పట్లో వంశీ ఓడిపోతాడని తెలిసి తాను ఎలాగైనా గెలవడం కోసం 12 వేల దొంగ ఇళ్ల పట్టాలను సృష్ట్టించి వారి ఓట్లతో తక్కువ మెజారిటీతో బయటపడినట్లు నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. వైసీపీ అధికారంలోకి రావడంతో తనకు అధికార పార్టీ మీద ఉండే మోజుతో వైసీపీలో చేరి గత పదేళ్లుగా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ బలపడటానికి కస్టపడి పనిచేసిన కార్యకర్తలను వేధిపులకు గురి చేస్తూ పోలీస్ స్టేషన్ లకు పిలిచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయాన్ని గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు వైసీపీ అధిష్టానానికి మొరపెట్టుకున్నా ఫలితం కనపడటం లేదట.

గన్నవరం నియోజకవర్గంలో సౌమ్యుడు వైసీపీ నేత డాక్టర్ దుట్టా రామచంద్రరావు కార్యకర్తలకు అండగా నిలుస్తూ ముందుకు వెళ్లడంతో అతడి వర్గీయులను కూడా వంశీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలా యార్లగడ్డ వెంకటరావు, దుట్టా వర్గీయులను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రతి రెండు రోజులకు ఏదో ఒక చోట గలాటా చేయడం వల్లభనేని వంశీ అనుచరులకు పరిపాటిగా మారింది. దీనిపై యార్లగడ్డపై వెంకటరావు నిన్న మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తాము వైసీపీ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నామని కొత్తగా వచ్చిన పచ్చ బ్యాచ్ ఇలా తమ కార్యకర్తల పట్ల దురుసుగా వ్యవహరిస్తే చూస్తూ సహించే ప్రసక్తి లేదని. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు ఎదుర్కొని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాలక పక్షంలో కూడా కేసులు ఎదుర్కోవడం దౌర్భాగ్యమని చెప్పడంతో ఇప్పుడు వల్లభనేని వంశీకి ఎదురు వెళుతూ తాడో పేడో తెల్చ్జుకోవాలని దుట్టా, యార్లగడ్డ వర్గీయులు నిర్ణయించుకున్నారు.

ఎప్పుడో ఎన్నికలప్పుడు గొడవలు, గట్రాలతో పల్లెటూర్లలో వర్గాలుగా విడిపోయే వారు ఇప్పుడు వల్లభనేని వంశీ అతడి వర్గీయుల వలన ప్రతిరోజు ఈ లొల్లితో మాకేమిటని ఇక వల్లభనేని వంశీ తాను రాజకీయాల నుంచి తప్పుకొని తమకు కాస్త మానసిక ప్రశాంతతో కూడిన స్వేచ్ఛ ప్రసాదిస్తే అంతకన్నా తామేమి కోరుకోవడం లేదని నియోజకవర్గ ప్రజలు వారి బాధను సోషల్ మీడియా వ్యాప్తంగా వెళ్లబుచ్చుతున్నారు. కానీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చ్గిన తరువాత కూడా గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసులను ఎదుర్కొని వైసీపీ పార్టీని బతికించుకున్న కార్యకర్తలు ఇప్పుడు టీడీపీ పార్టీ తరుపున వల్లభనేని వంశీ గెలిచి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తుంటే అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తే వైసీపీ పార్టీకి గన్నవరం నియోజకవర్గంలో రాబోయే రోజులలో పెద్ద ఎదురు దెబ్బ తప్పదనిపిస్తోంది. అసలు ముందు వల్లభనేని వంశీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకోవడం చూస్తుంటే రాబోయే రోజులలో గన్నవరం నియోజకవర్గ పరిణామాలు ఎలా మారుతాయో చూడాల్సి ఉంది.

మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు చంద్రబాబు నాయుడుని తిడుతూ రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు వల్లభనేని వంశీ హీరోలా కనపడితే కనపడవచ్చుగాని, గన్నవరం నియోజకవర్గంలో వంశీతో పాటు అతడి అనుచరులు వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న తీరు ఎంతో దారుణమని, తమకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయోనని, తమకు ప్రశాంతమైన బతుకు కావాలని గన్నవరం వైసీపీ నేతలు వాపోతున్నారు.