అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ కుర్రకారుకి యూత్ ఐకాన్ గా మారిపోయి ఈరోజు విడుదలైన “గీత గోవిందం” సినిమా వైపు పరుగులు పెట్టిస్తున్నాడు.

చాగంటి కోటేశ్వర రావు ప్రవచనాలు వింటూ తన జీవితాన్ని సాఫీగా కొనసాగించే ఒక కుర్రోడు (విజయ్ దేవరకొండ), తాను చేసుకోబోయే అమ్మాయి కూడా తనలాగే సంప్రదాయబద్ధంగా ఉండాలని కోరుకొని పెళ్ళైన అమ్మాయి వెనుక ఆరునెలలు తిరిగి, తరువాత ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లందని నిజం తెలుసుకొని నిరుత్సాహపడతాడు. అసిస్టెంట్ ప్రొఫిసర్ గా పనిచేసే విజ‌య్‌ను ఆ కాలేజిలోనే నీలు అనే స్టూడెంట్ ప్రేమిస్తుండటం కానీ విజయ్ తాను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి సంప్రదాయ బద్ధంగా ఉండాలని కళలు కంటూ ఉహల లోకంలో విహరిస్తుంటాడు.

విజయ్ కోరుకునే సంప్రదాయబద్ధమైన అమ్మాయి గీత (రష్మిక మంథాని) గుడిలో కనిపించడం మొదటి చూపులోనే ప్రేమలో పడి ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. చెల్లి పెళ్లి కోసం ఊరు బయలుదేరిన విజ‌య్‌కు అదే బస్సులో గీత కనపడటం, తన ప్రేమను చెప్పాలనుకునే సమయంలో తెలియని తుంటరి పనులతో ఆ అమ్మాయి మనస్సులో ఒక రోగ్ లా ముద్రపడిపోతాడు. గీత మనస్సు గెలవడానికి విజయ్ చేసే పనులు ఎంతో అందంగా కామెడీని జోడించి దర్శకుడు పరశురామ్ అందంగా తీర్చిదిద్దాడు.

ఎన్నో సినిమాలలో చూసిన పాత కథే అయినా… దర్శకుడు పరశురామ్ కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో పాటు… కథనం, డైలాగ్స్‌తో ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని అందించాడు. సినిమాలో కావాలని కామెడీ సీన్స్ జోడించకుండా క్యారెక్టర్స్‌తోనే మంచి కామెడీ పండించాడు. మొదటి అర్ధభాగం మంచి కామెడీతో ఆకట్టుకొని రెండవ భాగం కొంత సినిమా మీద పట్టు కోల్పోయాడు దర్శకుడు. కొన్ని సన్నివేశాలు నాటకీయత ఎక్కువ కనపడటంతో సహజత్వం లోపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ కొంత సాగతీసినట్లు పంటి కింద రాళ్ళలా అప్పుడప్పుడు అనిపించినా తరువాత వచ్చే కామెడీతో ఆ లోటు భర్తీ అయిపోతుంది. విజ‌య్‌కు తండ్రిపాత్రలో నటించిన నాగబాబు తన గంబీరమైన నటనతో ఆకట్టుకోగా, వెన్నెలకిషోర్, రాహుల్, అభయ్ తమ కామెడీతో బాగా ఆకట్టుకున్నారు. ద్వితీయార్ధంలో వెన్నెలకిషోర్ పండించిన హాస్యం హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా పరశురామ్ ఫుల్ మార్కులు సాధించాడు.

అర్జున్ రెడ్డి సినిమాలో ఒక యాటిట్యూడ్ తో నటించిన విజయ్ ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో పూర్తిగా ఒక సంప్రదాయబద్ధమైన కుర్రాడిలా నటించి అందరిని ఫిదా చేసాడు. అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తరువాత అందరూ విజయ్ తరువాత సినిమా కూడా మాస్ మసాలా సినిమా అయితేనే ప్రేక్షకులను రీచ్ అవుతాడనుకున్న వారికి గీత గోవిందం సినిమాలో… ఒక బయస్తుడిలా హీరోయిన్ ప్రేమను పొందటానికి మేడం… మేడం అంటూ తిరిగే సన్నివేశాలలో అద్భుతంగా నటించాడు. తనలో రౌడీ ఫెలోతో పాటు మంచి నటుడున్నాడని నిరూపించుకోవడానికి గీత గోవిందం సినిమా విజ‌య్‌కు చాలా ఉపయోగపడింది. విజయ్ సినిమాలో మంచి కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో హీరోగా తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. సినిమా ఫ్రీ క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్‌లో విజయ్ కంటతడిపెట్టించే నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

చలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా రష్మిక మందాన, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాల దగ్గరైందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రష్మికకు నటనలో మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరకడంతో… చాల సన్నివేశాలలో విజ‌య్‌తో పోటీ పడి నటించింది. సినిమాలో ముఖ్యంగా మేజర్ ప్లస్ పాయింట్ గోపిసుందర్ సంగీతం, కథలో భాగంగా వచ్చే పాటలు ప్రేక్షకులను మరింత కనెక్ట్ చేస్తాయి. మణికందన్ అందించిన సినిమాటోగ్రఫీ చాల బాగుంది. సినిమా లొకేషన్ల కోసం ఎక్కువ కష్టపడకుండా సింపుల్ లొకేష‌న్స్‌లోనే సినిమాను పూర్తి చేసారు.

చివరిగా : ఈ గోవిందుడు గీతకు దాసుడు
రేటింగ్ : 3/5
రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి