కచ్చులూరు వద్ద గత వారం జరిగిన బోటు ప్రమాదంలో 40 మందికి పైగా మృతవాత పడ్డారు. ఇంకా దాదాపుగా 13 శవాల వరకు వెలికితీయవలసి ఉంది. సుడిగుండాలు మధ్య బోటు ఇరుక్కుపోవడంతో పాటు, దాదాపుగా 200 అడుగులకు పైగా లోతులో బోటు ఉండిపోయింది. ఆ బోటుని కనుక బయటకు తీస్తే అందులో ఎన్ని శవాలు ఉన్నాయో లెక్క తేలుతుందని చెబుతున్నారు. బోటు తీయడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సాంకేతిక పద్ధతులతో పాటు విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి బయటకు తీయడానికి తీవ్ర కృషి చేస్తున్నారు.

ఇక ఈ గోదారమ్మ చెంతన ఉన్న దాదాపుగా 13 గ్రామాల ప్రజలు మాత్రం శవాలు మొత్తం తీసే వరకు తాము గోదావరి నీటిని ముట్టుకోమని, గోదావరి తల్లి మైల పడిందని, తాము మైల పడిన నీటిని వాడుకోలేమని తెగేసి చెబుతున్నారట. ఎంత కష్టమైన శవాలు మొత్తం వెలికితీసిన తరువాతనే తాము గోదావరి నీటిని వాడుకుంటామని చెప్పడంతో అధికారులు విస్తు పోతున్నారు. అధికారులు ఎంత నచ్చ చెప్పి ఆ నీటిని వాడుకోమని చెప్పినా ససేమీరా అనడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో 2018 లో కూడా ఇక్కడ బోటు ప్రమాదం జరిగినప్పుడు మృతదేహాలను బయటకు తీసే వరకు గోదావరి నీటికి అధికారులు దూరంగా ఉన్నారు.