పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల పాల్వంచ అటవీ ప్రాంతం నడుమ దట్టమైన అటవీ ప్రదేశం నందు ఆలయ పరిసరాలు ప్రకృతి అందాలతో, ఎటు చూసిన పొడవైన చెట్లు, చుట్టూ ఎతైన కొండలు, కోనలు గలగల పారె సెలయేటి సవ్వడుల నడుమ ఒక రాతి కొండ మధ్యలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసింది ఆ తల్లి, అందుకే ఆమెను గుబ్బల మంగమ్మ తల్లిగా పిలుచుకుంటూ గిరిజనులకు కొంగు బంగారంగా తరతరాలుగా పూజలందుకుంటూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు కూడా పెద్దసంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. శ్రీశ్రీశ్రీ మాతృశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి వనదేవత ఆలయం, జంగారెడ్డి గూడెం నుంచి 25 కిలోమీటర్ల దూరములో ఉన్న బుట్టాయగూడెం మండలం కోర్సావారిగూడెం పంచాయతీ గోగులపూడి గ్రామ సమీపాన ఈ ఆలయం ఉంది.

బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కరటం కృష్ణమూర్తి అనే అసామికి 32 ఏళ్ల కిందట వెదురు కోసం అడవికి వెళ్లారు. సేకరించిన వెదురుతో, ఎడ్ల బండిపై తిరుగు ప్రయాణమవుతుండగా తోవలో బండి తిరగబడింది. బండి తిరగబడిన దాని గురించి ఎంత ఆలోచించిన కృష్ణ మూర్తికి అంతు చిక్కలేదు. ఇక బండి ఎత్తుకొని తిరిగి ఇంటికి చేరుకొని, ఆ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మంగమ్మ తల్లి కలలో కనిపించి, అడవిలో సెలయేటి మధ్యనున్న గుబ్బలు గుబ్బలుగా ఉండే రాతి గుహలో తాను కొలువై ఉన్నట్లు చెప్పిందని, వెంటనే ఆ కలలో నుంచి మెళకువలోకి వచ్చిన  కృష్ణమూర్తి తెల్లవారు జామునే గ్రామస్థులతో కలసి అడవికి వెళ్లి గుహలో చూడగా మంగమ్మ తల్లి కొలువై దర్శనమిచ్చినది అని ఆ ప్రాంతంలో ప్రజలు చెబుతుంటారు. కృష్ణ మూర్తి, ఆ గిరిజన ప్రజలు అప్పటి నుంచి మంగమ్మ తల్లికి పూజలు చేస్తూ, ఆ తర్వాత ఇక్కడ స్వయంభువుగా వెలసిన మంగమ్మ తల్లి గురించి ప్రచారం చేయడంతో భక్తుల రాక క్రమ క్రమముగా పెరిగింది. అప్పటి నుంచి ప్రతి ఆదివారం, మంగళవారం పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడకు రావడం మొదలైంది. ఆలయానికి రద్దీ పెరగటంతో స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు చాల ప్రయత్నించారు. అప్పుడు ఈ ప్రాంతానికి చెందిన  కొండ రెడ్లు అడ్డుపడి తామే ఈ ఆలయం బాగోగులు చూసుకుంటామని అధికారులకి నచ్చ చెప్పటంతో అధికారులు చేసేది ఏమిలేక వారి ప్రయత్నాలను విరమించుకున్నారు. కొంతకాలం క్రితం ఇక్కడ భక్తుల అవసరార్ధం అటవీశాఖ ఆధ్వర్యములో కాటేజులు ఏర్పాటు చేసారు. ఏటా కార్తీక మాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

సీతా రామ, లక్ష్మణులు వనవాస కాలంలో ఈ అడవిలో గడిపినట్లు చెబుతారు. ఈ అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ తల్లి త్రేతాయుగంలో వెలిసినట్లు పురాణాలూ చెబుతున్నాయి. ఆలయానికి దగ్గరలో రెండు మామిడి చెట్లని రామ, లక్ష్మణులుగా భక్తులు పిలుచుకుంటారు. అరణ్యవాస కాలములో పాండవులు కూడా ద్వాపరయుగంలో ఈ అడవిలో కొన్ని రోజులు సంచరించారని చెబుతారు. రాక్షషులు కూడా ఈ ప్రాంతములో సంచరించేవారని, వారిలో వారికీ గొడవలు జరిగి పెద్ద యుద్ధం జరిగినప్పుడు, రాక్షసుల పోరులో గుబ్బల మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందని, దీంతో కోపగించిన మంగమ్మ తల్లి రాక్షసులను సంహరించిందని, ఆమె ఆగ్రహజ్వాలలకు ప్రకృతి అల్లకల్లోలం కాగా, దేవతలంతా దిగివచ్చి, ప్రార్థనలు చేసి ఆమెను శాంతింపజేశారని స్థలపురాణం చెబుతోంది. నాటి నుంచి గలగల పారే సెలయేటి నడుమ గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో మంగమ్మ తల్లి వెలిసిందని, అందుకే గుబ్బల మంగమ్మ తల్లిగా ప్రసిద్ధి పొందిందని చెబుతారు. మంగమ్మ తల్లికి తోడుగా ఇక్కడ గంగమ్మ, నాగమ్మ తల్లులు కూడా వెలిసినట్లు చెబుతారు.

గుబ్బల మంగమ్మ తల్లి ప్రత్యేకత గుడిపై భాగం నుంచి ఏడాది పొడవునా నీటి ధారలు జాలువారుతూ ఉండి మరింత రమణీయత ఉట్టిపడుతుంది. ప్రతి మంగళవారం, ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు గుబ్బల మంగమ్మ తల్లి మీద అపార నమ్మకం కలిగి ఉన్నారు. ప్రతి మంగళవారం, ఆదివారం వచ్చే భక్తులతో ఆ ప్రదేశమంతా వనభోజనాలని తలపిస్తాయి. ఎవరకి వారు చెట్ల కింద వారి వారి వంట తెచ్చుకున్న వంట సామగ్రితో అక్కడే వండుకొని సాయంత్రం వరకు విడిది చేస్తారు. గిరిజనుల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ కొన్నాళ్లపాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో చిక్కుకుంది.

గుబ్బల మంగమ్మ తల్లి గుడిని చేరే మార్గాలు :

జంగారెడ్డి గూడేనికి  సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుబ్బల మంగమ్మ ఆలయం. దూర ప్రాంతాలవారు జిల్లా కేంద్రం ఏలూరు వరకు రైలులో రావచ్చు. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని జంగారెడ్డిగూడెం వరకు బస్సులో చేరుకుని, అక్కడి నుంచి మంగమ్మ ఆలయానికి బస్సు లేదా ఇతర వాహనాల్లో రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి విమానమార్గంలో వచ్చేవారు విజయవాడ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు. ఇక్కడ రాత్రివేళ బస చేయరాదు అని ఆచారం. అందువల్ల ఆలయ సందర్శన పూర్తయిన తర్వాత జంగారెడ్డిగూడెం చేరుకుని, అక్కడి హోటల్ నందు బస చేయవచ్చు.

ఇక్కడకి 7 కిలోమీటర్ల దూరంలో దొరమామిడి డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ ఎర్రకాలువ మీద నిర్మించబడింది గుబ్బల మంగమ్మ గుడికి వచ్చిన వారు డ్యామ్ దగ్గరకి కూడా వెళుతూ ఉంటారు.   




  •  
  •  
  •  
  •  
  •  
  •