‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో రామ్ యాక్టింగ్ చూస్తే రామ్ ఏమైనా 100 ఎనర్జీ డ్రింక్స్ తాగాడా అన్నట్లు నటించాడు. ఈ సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే రామ్ మాత్రం తనను వాడుకుంటే తనలో మంచి నటుడితో పాటు, ఊర మాస్ క్యారెక్టర్ దాగి ఉందని నిరూపించాడు. 

ఇక మూడు సంవత్సరాలుగా హిట్ లేక డీలా పడ్డ పూరికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు తనకు దొరికిన అద్భుతమైన కథను మెప్పించడంలో సగం సఫలమై, సగం విఫలమయ్యాడు. ఈ సినిమాలో హీరో రామ్ కు మైండ్ లో తనకు తెలియకుండా పెట్టే చిప్ తో కొంతసేపు ఊర మాస్ క్యారెక్టర్ లో నటిస్తూ, మరికొంత సేపు పోలీస్ ఆఫీసర్ అంటూ చేసే రోల్ సీరియస్ నెస్ కనిపించలేదు. ఆ రెండు క్యారెక్టర్స్ మధ్య వచ్చే సీన్స్ నవ్వు తెప్పిస్తాయి తప్ప ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ కనపడదు. 

రామ్ కు చిప్ పెట్టినట్లు పూరి జగన్నాధ్ కు దర్శకత్వం చేసేటప్పుడు తన మెదడులో కూడా ఏదో చిప్ పెట్టారనుకుంటా… అందుకే సినిమాను ఆధ్యంతం ఆసక్తిగా ముందుకు తీసుకు వెళ్లే స్టఫ్ ఉన్నా… పూరి మాత్రం అక్కడక్కడా తేలిపోయాడు. పూరికి ఇదే స్టోరీ కనుక పోకిరి సినిమా టైమ్ లో పడితే తెలుగు ఇండస్ట్రీలో మరో ఊర మాస్ సూపర్ హిట్ సినిమాగా నిలిచిపోయేలా తీర్చిదిద్దేవాడు.

ఇక మొదటి అర్ధభాగం కథను ముందుకు నడిపించినా, రెండవ అర్ధభాగం కథను ముందు తీసుకువెళ్లడానికి ఎలాంటి స్కోప్ లేకపోవడంతో పాటు, విలన్ రోల్ చాలా సాదాసీదాగా పవర్ లెస్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకోకపోవడంతో ఏదో హడావిడి తప్ప బలం ఏమాత్రం కనపడలేదు. ఎప్పటిలానే తుపాకుల శబ్దంతో పాటు, ఊర మాస్ రోల్ తో తన పాత సినిమా జ్ఞాపకాల నుంచి పూరి బయటకు వస్తున్నట్లు లేడు.

ఒకరి మెమరీని తీసేసి మరొకరి మెదడులో పెట్టే “సైన్స్ ఫిక్షన్” తో కూడిన సినిమాను డీల్ చేయడంలో పూరి పూర్తి సక్సెస్ కాలేకపోయాడు. ఇక సినిమాలో అక్కడక్కడ వచ్చే బోరింగ్ సీన్స్ ను మణిశర్మ తన మ్యూజిక్ తో కవర్ చేశాడనే చెప్పుకోవచ్చు. 2016 లో వచ్చిన హాలీవుడ్ సినిమా “క్రిమినల్” సినిమా ఆధారంగా ఒకరి మెమొరీని వేరొకరి మెమోరీలో పెట్టడమనే కాన్సెప్ట్ తీసుకున్న ఆ ఒక్కటి తప్ప మిగతా స్టోరీ అంతా పూరి జగన్నాధ్ స్టైల్ లోనే నడిచింది.

ప్రతి సినిమాలా పూరి జగన్నాధ్ ఒకటి రెండు రోజులలో కథపై దృష్టి పెట్టి ముగించినట్లు కాకుండా కొంత సమయం కథపై కేటాయించినట్లు ఉన్నాడు. ఇక సినిమాలో నటించిన హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్ ఇద్దరు పోటీలు పడి అందాలు ఆరపోశారు. వరంగల్ అమ్మాయిగా నభా చేసిన క్యారెక్టర్ కొంచెం చికాకు తెప్పిస్తుంది. ఇక సినిమాలో నటించిన సత్యదేవ్ కు తనకు తగ్గ క్యారెక్టర్ దొరకలేదని చెప్పుకోవచ్చు. షాయాజీ షిండే పాత్ర రొటీన్ గా నడుస్తుంది. ఆశిష్ విద్యార్థి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేలా ఆతని పాత్ర కోనసాగింది.

ఈ సినిమా పూరికి ఎంత హెల్ప్ అయిందో చెప్పలేం కానీ, రామ్ కు మాత్రం మంచి బూస్టింగ్ అనే చెప్పుకోవచ్చు. రామ్ కు ఇలాంటి క్యారెక్టర్ ముందు ముందు వచ్చినా ఆశ్చర్యం కలగక మానదు. పూరి జగన్ మాత్రం తనకు నచ్చిన తుపాకుల గొడవ, ఊర మాస్ క్యారెక్టర్స్ జోలికి వెళ్లకుండా కొత్త తరహాలో ఆలోచిస్తే సినిమా మరో లెవెల్ లో ఉండేది. 

ఎన్నో సస్పెన్సు థ్రిల్లర్ సినిమాలతో కొత్త దనాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఈ కాలంలో… కొత్త ఆలోచనతో ప్రేక్షుకుల ముందుకు వచ్చిన “సైన్స్ ఫిక్షన్” సినిమాకు యాక్షన్ జోడించి తన మార్క్ చూపించాలనుకొని పూరి తడపడ్డాడు.

చివరిగా : పూరి మెమరీ లాస్ 

రేటింగ్ : 2.5/5 

రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి 

 
  •  
  •  
  •  
  •  
  •  
  •