“ముఖా ముఖి” కార్యక్రమానికి స్వాగతం నా పేరు “జాఫర్” ఈ వారం మా అతిధి… అంటూ మొదలు పెట్టి సూటిగా సుత్తి లేకుండా తాను అడిగే ప్రశ్నలతో రాజకీయ నాయకులకు మూడు చెరువులు నీళ్లు తగ్గించే జాఫర్ ఇక నుంచి టీవీ9 లో తెరమరుగు కానున్నాడు. ఈ విషయం స్వయంగా ఈరోజు జాఫర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియచేసాడు. టీవీ9 ఛానల్ వారికి తనతో అవసరం లేదనుకుంటా తనను తీసివేశారని కాని నాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదని 15 ఏళ్లుగా తన ప్రయాణం కొనసాగిస్తున్నానని టీవీ9 నుంచి బయటకు రావడమే కొంచెం బాధగా ఉందని తెలియచేసాడు.

ఇక తన 15 ఏళ్ళ టీవీ9 ప్రస్థానంలో తాను ఎలా ఎదిగింది తెలియచేసాడు. టీవీ9 సంస్థ ద్వారా తాను దాదాపుగా 800 స్టింగ్ ఆపరేషన్స్ చేశానని, 175 ముఖాముఖి ప్రోగ్రామ్స్ తో రాజకీయ, సినిమా ఇంకా ఇతర రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం జరిగిందని తెలియచేసాడు. ఇంకా జాఫర్ చెబుతూ తన కెరీర్ లో తాను 2007లో చేసిన రెడ్ లైట్ ఏరియాలో మగ్గిపోతున్న వారి జీవితాలను వెలుగులోకి తీసుకురావడానికి చేసిన స్టింగ్ ఆపరేషన్స్ వలన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు స్పందించి వారందరిని ఆ ఊబిలో నుంచి జాగ్రత్తగా బయటకు తీసుకురావడం జరిగిందని తెలియచేసారు.

ఇక తాను “ముఖా ముఖీ” ప్రోగ్రాం ద్వారా ఇంటర్వూస్ 2014లో మొదలుపెట్టానని, మొదటి ప్రోగ్రాం నచ్చడంతో అప్పటి టీవీ9 సీఈఓ రవిప్రకాష్ ప్రోగ్రాం కు “ముఖా ముఖీ” అని పేరు పెట్టి ఇదే ప్రోగ్రాం కంటిన్యూ చేయమని చెప్పారని, ఇన్ని రోజుల తన టీవీ9 సంస్థతో అనుబంధం తెగిపోతునందుకు బాధగా ఉన్నా.. ఎక్కడో ఒక చోట బ్రేక్ రావడం సహజమని… ఒక నెల రోజుల పాటు ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయించి, తరువాత తిరిగి టీవీ రంగంలోకి వెళ్లాలా లేక డిజిటల్ మీడియా వైపు అడుగులు వేయాలా అన్నది నిర్ణయించుకుంటానని తెలియచేసారు. కాని తనను టీవీ9 నుంచి ఎందుకు తొలగించారన్న విషయం మాత్రం చెప్పకుండా టీవీ9 యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇక నుంచి టీవీ9లో ముఖా ముఖి ప్రోగ్రాం వేరొకరితో కంటిన్యూ చేస్తారా లేక ప్రోగ్రాం నే నిలిపివేస్తారో చూడాలి.