ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత ఎవరి లెక్కలు ఏమిటో ఒక స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికలలో జనసేన పార్టీ దారుణాతి దారుణంగా ఓటమిని మూటగట్టుకోవడంతో ఆ పార్టీలో ఉండేందుకు ఎవరు సాహసించడం లేదు. వైసీపీ, లేదా బీజేపీ పార్టీ వైపు వెళ్ళడానికి జనసేన పార్టీ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనకు రాజీనామా చేసేసారు. రావెల ఇప్పటికే బీజేపీలో చేరితే, ఆకుల కూడా బీజేపీలోకి వస్తానని అధిష్టానానికి కబురు పంపినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో నాదెండ్ల మనోహర్ తో పాటు, జేడీ లక్ష్మీనారాయణ కూడా ముందు వరసలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో వచ్చే ఐదు సంవత్సరాలు జనసేన పార్టీని ఎలా ముందుకు నడపాలనే దాని మీద పవన్ కళ్యాణ్ తర్జన భర్జన అవుతున్నట్లు తెలుస్తుంది. ముందుగా వలసలను నివారించేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేయడానికి ఈరోజు తాడేపల్లిలో సమావేశం అవుతున్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలలో పార్టీని బలోపేతం చేయడానికి గ్రామా కమిటీలను వేయనున్నారు. కానీ పార్టీలోని ముఖ్య నాయకులు అంతా వేరే పార్టీల వలస పడుతుంటే, గ్రామా కమిటీలు వేయడానికి కూడా తలకు మించిన భారంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలసి వెళ్లడం వలనే చివరకు మా పరిస్థితి ఇలా తయారైనదని, జనసేన పార్టీకి భవిష్యత్ లేదని, ఆ పార్టీలో ఉంటే మా రాజకీయ భవిష్యత్ నే ప్రశ్నర్ధకంగా మారుతుందని కొంతమంది బహిరంగంగానే వెల్లడిస్తున్నారట. ఒకరిద్దరైతే ఏకంగా పవన్ కళ్యాణ్ ముందే ఆక్రోశం వెళ్లగక్కి సమావేశాల నుంచి బయటకు వెళ్లిన ఘటనలు కూడా ఏర్పడ్డాయని తెలుస్తుంది. ఇలాంటి పరిణామాల మధ్య జనసేన పార్టీ ని వచ్చే ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఎలా నడుపుతారన్నదే పెద్ద చర్చగా మారింది.
  •  
  •  
  •  
  •  
  •  
  •