అనంతపురం జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ త్వరలో బీజేపీ పార్టీలో తెలుగుదేశం పార్టీ విలీనమయ్యే అవకాశం ఉందని… తాము బీజేపీతో విడిపోయినా తిరిగి తాళి కట్టించుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ… బీజేపీతో కలసి ముందుకు వెళ్లడమే ఉత్తమమని… రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని…బీజేపీకి చంద్రబాబు అవసరం ఉందని… నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు ఎంతో విలువైన సలహాలు ఇవ్వగలడని అన్నారు. టీడీపీ పార్టీని వీడి బీజేపీకి వెళ్తున్న వారిని కట్టడి చేయాలంటే అర్జెంట్ గా బీజేపీతో కలవడమే ఉత్తమం అన్నట్లు జేసీ మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనలో ఉండగానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించాయి. గతంలో జేసీ కుటుంబం కూడా బీజేపీకి వెళ్లడానికి ప్రయత్నాలు చేసారు. ఎందుకనో మరలా ఆ దిశగా ఆలోచించలేదు. గత ఎన్నికలలో జేసీ సోదరులు ఎన్నికల బరి నుంచి తప్పుకొని తమ ఇద్దరి కొడుకులను ఒకరిని ఎంపీగా, మరొకరిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. ఇద్దరు దారుణ పరాజయం పాలవవడంతో వారి రాజకీయ జీవితం కోసమైనా ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో త్వరలో జేసీ కుటుంబం కూడా ఆ దిశగా అడుగు వేయవచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలను బట్టి వ్యాఖ్యానిస్తున్నారు.      

 
  •  
  •  
  •  
  •  
  •  
  •