తమిళ యాక్టర్ హీరో సూర్య అతడి తమ్ముడు కార్తీ ఇద్దరకీ తెలుగులో మంచి మార్కెట్ ఒకప్పుడు ఉండేది. ఇద్దరు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటూ డిఫరెంట్ సినిమాలవైపు అడుగులు వేయడంతో అవి పల్టీ కొట్టడంతో తెలుగులో దాదాపుగా వారి మర్కెట్ ను కోల్పోయారు. కార్తీ విషయానికి వస్తే అతడి పేస్ లోనే నవ్వు ఉట్టిపడటంతో పాటు మంచి టైమింగ్ ఉన్న కామెడీ చేయడంలో సిద్ధహస్తుడైన అటు వైపు నడవకుండా ఎంత సేపటికి రొటీన్ సినిమాలు చేయడానికి ఇష్టపడకుండా కొత్తదనాన్ని కోరుకుంటుంటాడు. ఈ మధ్య కాలంలో అతడు డిఫరెంట్ గా చేసిన “ఖాకి” సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో మరోసారి “ఖైదీ” పేరుతో ప్రేక్షకుల ముందు వచ్చాడు.

ఈ సినిమా విషయానికి వస్తే ఒక పాట లేదు, ఒక రొమాన్స్ లేదు… అసలు హీరోయిన్ నే లేదు. ఇలా కార్తీ సినిమా గురించి మొదట చెబుతుంటే ఈ కార్తీకి ఏమైనా బాసు పిచ్చెక్కిందా కెరీర్ ను నాశనం చేసుకుంటున్నాడని, హీరోయిన్ లేకుండా, పాట లేకుండా సౌత్ ఇండియాలో సినిమాలు ఆడే పరిస్థితి ఉన్నాయా అని వ్యాఖ్యానాలు చేసినవారే.

కానీ నిన్న “ఖైదీ” సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదలై మొదటి ఆట నుంచే సినిమాను ఏమి తీసాడు బాసు డైరెక్టర్…కార్తీ ఏమి యాక్టింగ్ చేశాడు బాసు అనేలా ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కథలో కొత్తదనంతో పాటు దానిని హీరో దృష్టితో కాకుండా దర్శకుడి దృష్టితో సినిమాను తీస్తే సూపర్ సక్సెస్ చేయవచ్చు అనడానికి “ఖైదీ” సినిమానే ఒక నిదర్శనం.

ఈ సినిమాలో కార్తీ నటించాడు… నటించాడంటే నటించాడు… అతడి పాత్ర ఏమి అంత ఎక్కువగా ఉండదు. అతడి పాత్రకు సమానంగా ఐదుగురు విద్యార్థుల పాత్ర కూడా సమానంగా ఉంటుంది. కాదు కూడదు తాను హీరోను నా పాత్రకు ప్రాధన్యత ఉండాలని అనుకుంటే మాత్రం సినిమా “దూద్ కాశీకి” చేరుకునేది. కథను నమ్మి దర్శకుడుకి పూర్తి బాధ్యతలు అప్పగించడంతో తన మనస్సుకు నచ్చినట్లు తన కలానికి ఏవిధంగా పదును పెట్టాడో అదే విధంగా సినిమాను తీసి ఎమోషన్స్ తో పాటు యాక్షన్ తో కూడిన థ్రిల్లర్ ను ప్రేక్షకులకు అందించాడు. డైరెక్టర్ చెప్పినట్లు కాకుండా హీరోయిన్ ఉండాలి, పాటలుండాలి… రొమాన్స్ ఉండాలన్న చెత్త ఐడియాలను కనుక డైరెక్టర్ పై కనుక హీరో లేదా నిర్మాతలు రుద్దితే సినిమాలో థ్రిల్ మిస్ అవ్వడమే కాకుండా ప్రేక్షకుడి నెత్తి మీద పెద్ద బండరాయి వేసినట్లు అయ్యేది.

ఈ సినిమా మొత్తం ఒక రాత్రిలో జరిగే వ్యవహారం… 900 కేజీల డ్రగ్ పోలీసులు పట్టుకుంటే దానిని ఎలాగైనా విడిపించుకోవాలని డ్రగ్ గ్యాంగ్ పోలీసులందరికి వారు ఒక పార్టీలో తాగే మధ్యంలో మత్తు మందు కలిపి వారు పడిపోయేలా చేయడంతో వారందరని అక్కడ నుంచి వేరొక చోటకు మార్చాలన్న ప్రక్రియలో ఓక్ పోలీస్ కార్తీ సహాయం తీసుకుంటాడు. ఒకేవైపు ఇలా కార్తీ కథ నడుస్తుండగానే మరొక వైపు అప్పుడే పోలీస్ గా డ్యూటీలోకి వచ్చిన ఒక కానిస్టేబుల్ తో పాటు ఐదుగురు విద్యార్థులు పోలీస్ స్టేషన్ లోపల ఉండి డ్రగ్స్ తో పాటు, అందులోని దొంగలు పారిపోకుండా ఎలా కాపాడారన్న రెండు పాయింట్లను పట్టుకొని కథ ఎంతో చాకచక్యంగా దర్శకుడు నడిపించాడు.

ఒక్కో సమయంలో కథ పోలీస్ స్టేషన్ లో చాల ఇంట్రెస్టింగ్ గా నడుస్తున్న క్రమంలో ఒక్కసారిగా కథను మరలా కార్తీ దగ్గరకు తీసుకొని వెళ్లి లారీ చేజిగ్ చూపిస్తుంటే… పోలీస్ స్టేషన్ లో ఆ విద్యార్థులు, కానిస్టేబుల్ పరిస్థితి ఏమిటి అక్కడ ఏమి జరగవచ్చు అనే ఆలోచనలో ఉండిపోతాం. డైరెక్టర్ తరువాత సీన్ ఎలా చూపించబోతున్నాడు అన్న ఇంటెన్సిటీ అయితే కచ్చితంగా ప్రేక్షకుడికి కలుగుతుంది. కానీ రెండవ భాగంలో కొంత నిడివిని తగ్గించుకొంటే మరింత బాగుండేది, రెండు గంటలలో ముగించవలసిన సినిమా మరొక 15 నిమిషాల పాటు పొడిగించి అక్కడక్కడే కథను తిప్పుతున్నాడా అనిపించే భావన కొద్దిగా కదులుతుంది. కానీ తమిళ దర్శకుడు లోకేష్ కంగరాజ్ కథలో చిన్న చిన్న లోటు పాట్లు ఉన్నా స్క్రీన్ ప్లే పై పర్ఫెక్ట్ గ్రిప్ తో అద్భుతంగా నడిపించాడు.

ఇక మత్తుగా పడిపోయిన 40 మంది పోలీసులను 80 కిలోమీటర్లు లారీలో తీసుకొని వెళ్లే క్రమంలో మధ్యలో విలన్లు అడ్డుకోవడం ఆ ఛేజులతో పాటు తన కూతురు కోసం కార్తీ పడే తపన, చివరకు తన కూతురుని కలుసుకున్నప్పుడు ప్రేక్షుకులను ఎమోషనల్ కు గురి చేస్తుంది. ఒకవైపున ఎమోషనల్ జర్నీతో పాటు మంచి థ్రిల్లర్ అందించి కార్తీ తాను వేసిన అడుగులు పర్ఫెక్ట్ అని నిరూపించుకొని ఇదే కోవలో మరికొన్ని సినిమాలు రావడానికి ఆస్కారం కలిగేలా చేశాడు. ఈ సినిమాతో మరోసారి కార్తీ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ అనేలా కలెక్షన్స్ కొల్లగొట్టడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.