ఒక సీరియస్ సినిమాకు డీసెంట్ లుక్ ఇచ్చినప్పుడే ఆ కథకు న్యాయం చేకూరుతుంది. కథ కాస్త అటు ఇటుగా ఉన్నా… ప్రేక్షకుడిని థియేటర్ లో కుర్చోపెట్టాలంటే కథనంలో బలం ఉండాలి. అలాంటిది కథను కథలా తీయకుండా పిచ్చి కామెడీని ఇరికించి… చెప్పాలనుకున్న పాయింట్ చెప్పకుండా కథనంలోనే లోటు పాట్లు ఉండటంతో సినిమాను పక్కదారి పట్టించడంలో “కథనం” సినిమా సక్సెస్ ఫుల్ గా తన జర్నీ కంప్లీట్ చేసుకుంది. కథ గురించి ఆలోచిస్తే.. ఇది చాల అద్భుతమైన కదా కదా అనుకుంటాం. కానీ స్క్రీన్ పైన చూస్తే తేలిపోతుంది. ఇదేమిటిరా ఇంత మంచి కథను ఇలా చెడకొట్టేసాడు అనుకుంటాం.

సినిమా రచయితగా పనిచేసే అనసూయ దర్శకత్వం కోసం ఎదురుచూస్తున్న సమయంలో నలుగురు నిర్మాతలు దగ్గర ఉన్న ఒక కథ డెవలప్ చేసి మెప్పిస్తుంది. ఆ చిత్రాన్ని అనసూయ దర్శకత్వ బాధ్యతలు అప్పగించడంతో మొదలయ్యే అసలు కథ… ఆమె రాసుకున్న కథనంలా బయట హత్యలు జరగడం అనే కాన్సెప్ట్ వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలాంటి సినిమాలు ఎన్నో రావచ్చు. కానీ ఆ కథలో క్రియేటివిటీ చూపించినప్పుడే కథలో ఉన్న బలం బయటకు వస్తుంది.

తాను రాసుకున్న కథకు సంబంధించి బయట జరుగుతున్న హత్యలకు సంబంధించి ఒకేలా ఉండటంతో దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే విధానం కూడా ప్రేక్షకులకు ఆసక్తి కలిగించదు. ఫస్ట్ హాఫ్ మొత్తం దర్శకుడు సినిమాను గాలికి వదిలేసి, సెకండ్ హాఫ్ లో కథను చెప్పడానికి దర్శకుడు ప్రయత్నం చేశాడు. సినిమా చూస్తుంటే కొన్ని సార్లు “ఏ ఫిలిం బై అరవింద్” సినిమా గుర్తు వచ్చేలా కథ నడుస్తుంటుంది.

ఇక సీరియస్ గా కథ నడుస్తున్న సమయంలో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరిక్షిస్తాయి. వెన్నెల కిషోర్ తో చేయించిన కామెడీ సీన్స్ నవ్వించకపోగా సినిమాకు పెద్ద మైనస్ గా మారాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సినిమా మొత్తానికి సంబంధించి చివరి 15 నిమిషాల మీదనే దర్శకుడు ద్రుష్టి పెట్టినట్లు కనపడుతుంది. కానీ కథలో చివరకు వచ్చే ట్విస్ట్ కూడా ముందుగానే ఊహించేలా ఉండటంతో సినిమా ముందుగానే తేలిపోతుంది.

ఇక అరవిందమ్మ పాత్రలో కనిపించిన అనసూయ తన పాత్రలో హుందాతనంతో పాటు, సినిమా మొత్తం భారాన్ని తానే మోసింది. ఇక అనసూయకు స్నేహితుడి పాత్రలో ధనరాజ్, పోలీస్ పాత్రలో రణధీర్ కాస్త ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక వర్గానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగోలేదు… సంగీతం బాగోలేదు… ఇక నేపధ్య సంగీతం అయితే ఓవర్ డోస్ అయ్యేలా ఉంది. ఇక నిర్మాణ విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎడిటర్ తన కత్తెరకు మరి కొంత పదును పెట్టినట్లయితే సినిమా పట్ల మరి కొంత ఆసక్తి ఏమైనా కనపడేదేమో… థ్రిల్లర్ సినిమాకు కావాల్సిందే మంచి “కథనం” కానీ ఈ సినిమాకు “కథనం” అని పేరు పెట్టి ఆ కథనాన్నే గాలికి వదిలేయడంతో సినిమాను ప్రేక్షకులు ఎంత వరకు మోస్తారన్నది ప్రశ్నార్ధకమే.

చివరిగా : కథ ఉన్నా కథనం మిస్
రేటింగ్ : 2/5
రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి