క్రికెట్ ను ప్రధానంగా చేసుకొని ఇప్పటికే తెలుగులో చాల చిత్రాలు నిర్మించారు. ఈమధ్యే నాని హీరోగా వచ్చిన “జెర్సీ” సినిమా కూడా ఘన విజయం సాధించింది. క్రికెట్ ప్రధానాంశంగా నిర్మించిన “కౌశల్య కృష్ణమూర్తి” సినిమా కూడా దాదాపుగా అలానే ఉంటుంది. కానీ ఈ సినిమాకు వ్యవసాయం… రైతుల కష్టాలను జోడించి దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు.

తమిళంలో రూపుదిద్దుకొని మంచి విజయాన్ని అందుకున్న “కణా” సినిమాకు రీమేక్ చేసి తెలుగులో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తీసుకువచ్చారు. ఈ మధ్య చాల సినిమాలు ఒక భాషలో హిట్ సాధిస్తే ఆ సినిమాను రీమేక్ చేసి పలు బాషలలో నిర్మిస్తున్నారు. “కౌశల్య కృష్ణమూర్తి” విషయానికి వస్తే తమిళంలో రూపొందించిన సినిమాను ఏమాత్రం చెడగొట్టకుండా అదే విధంగా తీయడం చిత్రానికి కొంత మైనస్.

తమిళంలో చూసిన వారికి ఈ సినిమా ఆకట్టుకునే అవకాశం లేదు. “కణా” సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలోనూ నటించడం విశేషం. ఐశ్వర్య రాజేష్ తాను చేసే సినిమాలు తన పాత్ర కథలో భాగమయ్యేలా ఎన్నుకోవడంలో సక్సెస్ అవుతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి.

ఒక వైపు తన తాత చనిపోయినా క్రికెట్ పై మక్కువతో క్రికెట్ చూస్తుండటం తన తండ్రిని ఐశ్వర్య చిన్నతనంలోనే గమనిస్తుంది. మరోసారి భారత్ మ్యాచ్ లో ఓడిపోతే కన్నీళ్లు పెట్టుకున్న తండ్రిని చూసి తాను ఎప్పటికైనా ఇండియన్ క్రికెట్ లో ఆడాలనుకుని తన కళను ఎలా సాకారం చేసుకుందో అద్భుతంగా చూపించారు.

వ్యవసాయంలో ఒకవైపున నష్టాలు రావడం, ఆడపిల్ల క్రికెట్ అంటు హేళన చేయడం, సభ్య సమాజం మొత్తం ఎలా చిన్న చూపు చూస్తారన్న విషయాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. సినిమాలో తాను ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లా కనపడటానికి ఐశ్వర్య చాల కష్టపడిందని చెప్పుకోవచ్చు.

వ్యవసాయమే ప్రాణంగా నమ్ముకున్న రైతు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకులను కన్నీరు పెట్టించాడు. రైతు పడే కష్టాలతో పాటు… రైతుగా బతకడం ఎంత కష్టమో… రైతు దుర్భర పరిస్థితుల గురించి రాజేంద్ర ప్రసాద్ చెప్పే డైలాగ్స్ మెప్పిస్తాయి. రాజేంద్ర ప్రసాద్ భార్యగా నటి ఝాన్సీ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఐశ్వర్య, రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ ఎమోషన్ సీన్స్ పండించడంలో ఒకరికొకరు పోటీ పడి రక్తి కట్టించారు.

క్రికెటర్ గా ఐశ్వర్య ఎదిగే సమయంలో తనకు సహాయపడే పాత్రలో కార్తీక్ రాజ్ నటించాడు. ప్రత్యేక పాత్రలో నటించిన తమిళ యాక్టర్ శివ కార్తికేయన్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సంగీత దర్శకుడు నేపధ్య సంగీతంతో సినిమాను మరో లెవెల్ కు తీసుకొని వెళ్ళాడు. సినిమాకు తగట్లు నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలు అన్ని చక్కగా కుదరడంతో “కౌశల్య కృష్ణమూర్తి” సినిమా తెలుగులో కూడా ఆకట్టుకునే అవకాశాలే ఎక్కువ.

చివరగా : సిక్స్ కొట్టిన కౌశల్య కృష్ణమూర్తి
రేటింగ్ : 2.75/5
రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి