ఆర్టీసీ కార్మికులు కార్మికులు గత 18 రోజులుగా చేస్తున్న సమ్మె కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలకు రావాలని, ప్రభుత్వంలోకి ఆర్టీసీ కార్మికులను విలీనం చేసి వారి కోర్కెలు తీర్చాలని వారికి బాసటగా నిలుస్తున్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈరోజు సీఎం కేసీఆర్ రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ సంస్థ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దీనిలో కేసీఆర్ మరోసారి స్పష్టత ఇస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచే అవకాశమే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. యూనియన్లు లేని ఆర్టీసీ కావాలని, ఇలా యూనియన్ల పేరుతో లొల్లి చేస్తే సహించే పరిస్థితి లేదని, అసలు ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలలోకి తీసుకోవడం కూడా జరగదని, ఉద్యోగాలు ఇమ్మని అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది.

ఆర్టీసీ కార్మికులకు మంచి మంచి జీతాలు ఇచ్చి ప్రభుత్వం ఆర్టీసీ వలన వచ్చే నష్టాన్ని భరిస్తూ ఎలాంటి లోటు పాట్లు లేకుండా నడుపుతుంటే గత 18 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన వందల కోట్ల రూపాయలు నష్టపోవలసి రావడంతో కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోసారి సంఘాల పేరుతో ఉద్యమాలు చేయకుండా ఉండాలంటే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది.

ఇక నిన్న ముగిసిన హుజుర్ నగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు తేటతెల్లం చేయడంతో రేపు 24వ తారీకు రిజల్ట్స్ కూడా సర్వేలు చెప్పినట్లు ఉంటే కేసీఆర్ మరింత కఠిన వైఖరితో ముందుకెళ్లినా ఆశ్చర్యం లేదని తెలుస్తుంది. ఇప్పటికే గత నెల జీతాలు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వకపోవడంతో ఆర్టీసీ జేఏసీ హైకోర్ట్ కు వెళ్లగా కోర్ట్ కూడా కార్మికులు పని చేసిన దానికి జీతాలు ఇవ్వాలని తెలియచేసినా 7 కోట్లకు మించి డబ్బులు లేవని, ఆర్టీసీ కార్మికులకు డబ్బులు ఇవ్వాలంటే 250 కోట్లు ఖర్చవుతుందని అంతా డబ్బు లేకపోవడంతో ఇవ్వలేకపోతున్నామని చెప్పి కేసీఆర్ సర్కార్ షాక్ ఇవ్వడం జరిగింది.

ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్టీసీ కార్మికులు దిగి రాక తప్పని పరిస్థితి నెలకొనేలా ఉంది. ఇక కేసీఆర్ కూడా ఒకవేళ ఆర్టీసీ కార్మికులు దిగి వస్తే యూనియన్లు అన్నింటిని రద్దు చేస్తేనే ఉద్యోగాలలోకి తీసుకుంటామని చెప్పినా చెప్పవచ్చు. ఆర్టీసీ కార్మికుల భవితవ్యం మాత్రం హుజుర్ నగర్ ఎన్నికపై ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.