ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొరపాటు చేశారని మళ్ళీ చంద్రబాబు నాయుడుని గెలిపిస్తే ఎంతో బాగుండేదని అభిప్రాయపడుతున్నారన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. గత ఐదు సంవత్సరాలుగా కేంద్రం నుండి రాష్ట్రానికి 600 అవార్డులు వచ్చాయని.. అన్ని ప్రభుత్వ శాఖలకు మన గొప్పదనం తెలుసన్నారు. కేంద్ర మంత్రులతో కలిసినప్పుడు ఏపీ ప్రజలు పొరపాటు చేశారని అన్నారని.. చంద్రబాబు గెలిస్తే బాగుండేదని.. కేంద్రంలో కూడా దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతుందన్నారు.

అలాగే రాజధాని అంత ఒకే చోట పెడితే అభివృద్ధి జరుగుతుందని.. ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల అభివృద్ధికి నిధులు వెచ్చించామన్న ఆయన.. విశాఖ, కాకినాడ, అనంతపురం వంటి ప్రాంతాలలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. రాజధానిలో అనుసంధాన రహదారులకు 9కోట్ల ఖర్చు చేశామని.. అభివృద్ధి అనేది ఆర్థికపరమైన వెంచర్స్, రాజధానిలోనే ఉండాలన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోవడం వల్ల మనం చాలా వెనకబడిపోతున్నామని గల్లా జయదేవ్ అన్నారు.