అధికార పార్టీ ఎమ్మెల్యే తాను ఏది చేసిన ఒప్పని భావిస్తూ తమకు నచ్చినట్లు వ్యవహారం నడపడంతో పాటు, తమకు కావాల్సిన పనులు చేయలేదని ప్రభుత్వ అధికారులపైనే చిందులు తొక్కుతుంటారు. ఇలానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వెంకటాచలంకు చెందిన ఎంపీడీఓ సరాలపై మొన్న రాత్రి ఆమె ఇంటికి వెళ్లి దుర్భాషలాడాడు. దీనితో ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ కేసు పెట్టడం ఇవన్నీ చక చక జరిగిపోయాయి.

కానీ అతడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెనకాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం, అరెస్ట్ చేస్తే మా ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు వస్తుందో అన్న భయం, దీనితో నిన్న రాత్రి ఢిల్లీ ప్రధాని మోదీతో మీటింగ్ ముగించుకొని అమరావతి తిరిగివచ్చిన సీఎం జగన్ తో డిజిపి సవాంగ్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే విషయం గురించి చర్చించడంతో సీఎం జగన్ చట్టం ముందు అందరూ సమానమే అని, ఎమ్మెల్యే తప్పు చేసినట్లు ఉంటే వెంటనే అతడిని అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని ఆదేశించడంతో ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు.

ప్రస్తుతానికి వైద్య పరీక్షల కోసం ఎమ్మెల్యేను ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. కోటంరెడ్డి అభిమానులు భారీగా చేరుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వ అధికారి వనజాక్షి మీద దుర్భాషలాడి జుట్టు పట్టుకొని ఇసుకలో పడేసి ఈడ్చుకెళ్లాడని ఆరోపణలు ఉన్నాయి. కానీ చింతమనేనిపై ఒక్క కేసు నమోదు చేయకపోగా, వనజాక్షి అనే మహిళా అధికారి మీదే ఆగ్రహం వ్యక్తం చేసి అసలు అక్కడకు అసలు నువ్వు ఎందుకు వెళ్లావని మాట్లాడినట్లు సమాచారం వచ్చింది. రాష్ట్ర ప్రజలందరు ఆ పరిణామాలు గమనించడంతో గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి చింతమనేని పరిణామాలు బాగా ప్రభావితం చేశాయి.