కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. 2014 రాష్ట్రం రెండు ముక్కలైన తరువాత చాల మంది కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలోకి వెళ్లి వారి రాజకీయ జీవితాన్ని పునరుద్ధరించుకున్నారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాలు చేస్తున్న కోట్ల కుటుంబం మాత్రం ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితమైనా పార్టీ మారడానికి ఇష్టపడలేదు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచే కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా నిలబడి దాదాపుగా లక్ష ఓట్లు తెచ్చుకున్నారు.

ఇక దాదాపుగా గత ఆరు నెలల నుంచి కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటాయని, ఆ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయాలనీ అభిలషించారు. కానీ తెలంగాణాలో కాంగ్రెస్ – టీడీపీ పొత్తు వికటించడంతో ఏపీలో తిరిగి ఆ రెండు పార్టీలు మరోసారి కలసి రాజకీయాలు చేయడానికి ఇష్టపడలేదు. నిన్న కాంగ్రెస్ పెద్దలు మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలో పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు.

kotla

దీనితో ఆగ్రహం చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రేపు కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ మార్పుపై వారి సూచనలు సలహాలు తీసుకోనున్నారు. కోట్లను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకునేందుకు దాదాపుగా గత మూడు సంవత్సరాలుగా నారా లోకేష్ బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ కోట్ల సున్నితంగా తిరస్కరిస్తూ కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు తనకు టీడీపీ – కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా దక్కుతుందనుకున్న ఎంపీ టికెట్ పై ఆశలు ఆవిరవ్వడంతో నేరుగా టీడీపీ పార్టీలో చేరి ఎంపీ టికెట్ పై పోటీ చేయాలని అనుకుంటున్నారు.

కానీ కొంత మంది కార్యకర్తలు మాత్రం వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతుండటంతో కోట్ల ఇప్పుడు వైసీపీలో చేరుతారా లేక టిడిపిలో చేరుతారా అనేది సస్పెన్సు గా మారింది. దాదాపుగా కోట్ల టిడిపిలో చేరాలని అనుకున్నా… చివరి నిమిషంలో పరిణామాలు మారి వైసిపిలో చేరిన ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. దీనితో ఇప్పుడు కర్నూల్ రాజకీయాలు వేడెక్కాయి. రేపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏర్పాటు చేయబోయే కార్యకర్తల మీటింగ్ తరువాత ఒక స్పష్టమైన సమాధానం రానుంది.